కాంగ్రెస్, టిడిపి డ్రామాలపై 'దాడి‌' ఫైర్

హైదరాబాద్, 10 ఆగస్టు 2013:

సీమాంధ్రలో ఉవ్వెత్తు ఎగసిపడుతున్న ఉద్యమంతో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి, మరి కొందరు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఇవ్వడమేమిటని దాడి తప్పుపట్టారు. తమ తమ గ్రూపు నాయకులకు వారు రాజీనామా లేఖలు ఇస్తున్నారు కానీ స్పీకర్లకు సమర్పించి వాటిని ఆమోదింజేసుకోవడం లేదేమని ప్రశ్నించారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలూ బాగుపడతాయన్నది తమ అభిప్రాయం అన్నారు.

ఇక ఎంపీల విషయానికి వస్తే.. రాజీనామా లేఖలు ఇచ్చిన తరువాత కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరవుతుండడంలో ఔచిత్యాన్ని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. అలాంటి రాజీనామాలకు విలువేమీ ఉంటుందని నిలదీశారు. రకరకాల ఫీట్లు చేస్తూ రాష్ట్ర ప్రజలను వెర్రివాళ్ళను చేసి నాటకాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన పది రోజుల తరువాత ప్రధానికి చంద్రబాబు నాయుడు లేఖ రాయడాన్ని దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సీమాంధ్ర ప్రజులు ఇప్పుడు జ్ఞాపకం వచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్టేటస్‌ కో పాటించండి, తదుపరి కార్యచరణను ఆపండి అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా చెప్పలేదన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తరువాత చంద్రబాబు ఆనందంగా, సంతోషంగా ప్రెస్‌మీట్‌ పెట్టారని, నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం ఏమిటని తూర్పారపట్టారు.

టిడిపి ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేశ్ పార్లమెంటులో బైఠాయించి పెద్ద యుద్ధమే చేశారన్నారు. విభజన తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చేత ఉత్తరం రాయించింది సుజనా చౌదరి కాదా? అని దాడి ప్రశ్నించారు. రాత్రి పది గంటల సమయంలో సుజనా చౌదరే ఆ ఉత్తరాన్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్ళి సంతకం చేయించింది సుజనా చౌదరి కాదా? అన్నారు. తద్వారా రాష్ట్ర విభజనకు సానుకూలత చేయించింది వారు కాదా? అని నిలదీశారు. ‌టిడిపి ఎంపిల నటన ప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్‌ను మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్కుమా‌ర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని తప్పుబట్టారని దాడి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి ఆంటోనీ నాయకత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ అని... ప్రభుత్వ కమిటీ కాదని దాడి వీరభద్రరావు అన్నారు.

Back to Top