నా వ్యాఖ్యలను వక్రీకరించారు : దాడి

హైదరాబాద్, 22 అక్టోబర్ 2013:

చంద్రబాబు నాయుడు సమైక్యవాదా.. విభజనవాదా స్పష్టం చేయకుండా ఆత్మగౌరవ యాత్ర పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పడం నిన్నటి నా మీడియా సమావేశ సారాంశమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ సమైక్య ద్రోహులన్నది తన అభిప్రాయమని తెలిపారు. రెండు పత్రికలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంబంధిత వక్రీకరణలను ప్రస్తావించారు.

చంద్రబాబు, కిరణ్‌ గురించి చెప్పిన అనేక వాస్తవాలను విడిచిపెట్టి.. కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని, వక్రీకరించి శీర్షిక పెట్టాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సరైన విధానం కాదని, యెల్లో జర్నలిజం కిందకు వస్తుందని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో తమ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై సోనియా కక్ష సాధింపుగా వ్యవహరించారని తాను చెప్పిన వైనాన్నిఆ రెండు పత్రికలు వక్రీకరించాయన్నారు. క్షమించమని సోనియాను కోరామని, అయినా ఆమె క్షమించలేదని తాను చెప్పని విషయాన్ని ఆ పత్రికలు ప్రచురించాయన్నారు. ఇది జర్నలిజంలో నైతిక విలువలకు వ్యతిరేకం అన్నారు. చంద్రబాబుకు అనుకూలంగానో లేక శ్రీ జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగానో, తనను అభాసు పాలు చేయడానికో ఇలా రాయడం సరికాదన్నారు.

తాజా ఫోటోలు

Back to Top