దాడి చేసి మాపైనే కేసులా? శిల్పా చక్రపాణిరెడ్డి

అభిరుచి మధు నేర చరిత్ర బాబు, లోకేష్‌కు తెలుసు
టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశాననే నాపై కక్ష
నంద్యాల ప్రశాంతతే మా లక్ష్యం
నంద్యాల: తెలుగు దేశం పార్టీ నంద్యాలలో అరాచకాలు సృష్టించి ప్రశాంతతకు భంగం కల్పిస్తుందని, తనపై దాడికి యత్నించి, నాపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. నంద్యాల ప్రశాంతతే శిల్పా సోదరుల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను మైనారిటీ నేత అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా అకారణంగా అభిరుచి మధు తన పై కాల్పులు జరిపారన్నారు. రాళ్లు రువ్వి, కాల్పులు జరపాల్పిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అసలు ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు ఆయన వద్ద గన్‌ ఎందుకు ఉందని ప్రశ్నించారు. అభిరుచి మధు నేర చరిత్ర కలిగిన వ్యక్తి అన్నారు. ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డాడని, భూమా నాగిరెడ్డిపై దాడి చేశారని, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కేబుల్‌ కార్యాలయంపై కూడా దాడి చేశారని తెలిపారు. ఈ విషయాలన్ని కూడా చంద్రబాబుకు, లోకేష్‌కు తెలుసు అన్నారు. మధు నేర చరిత్ర తెలిసే తాను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశానని తెలిపారు. ఆ కోపంతోనే తనపై కక్షగట్టారని చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు.  ఉప ఎన్నిక నేపథ్యంలో భూమా వర్గీయులు మా అన్న కొడుకుపై దౌర్జన్యం చేశారన్నారు.  ఇవాళ నాపై కాల్పులు జరిగిన సందర్భంలో పోలీసులు ఆలస్యంగా రావడం బాధాకరమన్నారు.  కేకలు వేసి చంపుతామని మధు నన్ను బెదిరించారని తెలిపారు. అధికారం ఉందని అరాచకాలకు పాల్పడితే ఊరుకోమని చక్రపాణిరెడ్డి హెచ్చరించారు.
Back to Top