ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

నక్కపల్లి: వైయ‌స్ఆర్ సీపీ గుర్తుపై పోటీచేసి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయాలని వైయ‌స్ఆర్ సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు డిమాండ్ చేశారు. పాయకరావుపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, జడ్‌పి ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావుల ఆధ్వర్యంలో నాలుగు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ తరపున పోటీచేసి గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్ర‌బాబు ప్రభుత్వ హాయంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. వేరొక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడమే కాకుండా వారికి మంత్రిపదవులు కట్టబెట్టి చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణాలో టీడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరితే అన్యాయమని, రాజ్యాంగ ఉల్లంఘన అని గొంతుచించుకుని అరచిన చంద్రబాబు ఇప్పుడు తన రాష్ట్రంలో చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే వారందరిచేత రాజీనామాలు చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్‌విసిరారు. ధ‌ర్నాలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top