మోడల్ కాలనీ పేరుతో కోట్లు దండుకున్నారు

హుజూర్‌నగర్‌: పేదలకు నిలువ నీడ కోసం అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తే నిర్మాణాలు చేపట్టకుండా కాంట్రాక్టర్లు కోట్లు దండుకున్నారని, వారితో స్థానిక ఎమ్మెల్యే, అప్పటి గృహ నిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుమ్మక్కయ్యారని వైయస్సార్‌ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నగర పంచాయతీ పరిధిలోని ఫణిగిరి గట్టు వద్ద ఉన్న మోడల్‌ కాలనీని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2012లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో సుమారు రూ.100 కోట్లతో మోడల్‌ కాలనీలో 2,160 జి ప్లస్‌వన్‌ భవన నిర్మా ణాల పనులు ప్రారంభించారని చెప్పారు.

అయితే నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వైఫల్యం వల్లే మోడల్‌ కాలనీ పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. తర్వా త అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ కాలనీని పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. భవన నిర్మాణానికి  రూ.5 లక్షల వ్యయాన్ని చూపి, భారీ అవి నీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  మోడల్‌ కాలనీ నిర్మాణాలపై జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
Back to Top