విభజనకు తొలి నుంచీ మేం వ్యతిరేకమే

న్యూఢిల్లీ, 16 నవంబర్ 2013:

భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనను తాము ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం అగ్ర నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కూడా రాష్ట్ర విభజనను మొదట‌ నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోందని ప్రశంసించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శనివారంనాడు తమతో చర్చించారని, ఒక్కసారి విభజించడం మొదలైతే తేనెతుట్టెను కదపడం లాంటిదే అని ఆయన చెప్పారు.

అనేక ఉద్యమాలు, త్యాగాల తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పటయ్యాయని, స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్ద కాలం పాటు ఈ ఉద్యమాలు జరిగాయని సీతారాం ఏచూరి అన్నారు. మళ్లీ ఈ రాష్ట్రాలను విడగొడితే అనేక సమస్యలు వస్తాయని సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌, ఆంధ్ర అసెంబ్లీలు విశాలాంధ్ర ఏర్పాటుకు తీర్మానాన్ని ఆమోదించాయని, రెండింట మూడు వంతుల మెజార్టీతో తీర్మానం ఆమోదించాయని సీతారాం తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇలాంటి విధానంలోనే అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందాలని చెప్పారు. అసెంబ్లీలోనైనా, పార్లమెంటులో అయినా తాము రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తామని, దీనికి సంబంధించి అభిప్రాయాలను రెండు పార్టీలు పంచుకున్నాయని అన్నారు. ఏ వేదికపైనైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

Back to Top