యుద్ధానికి ముందే పారిపోయిన పిరికిసైన్యం

()ప్రజాసమస్యల ప్రస్తావన రానివ్వకుండా బాబు కుట్రలు
()36 అంశాలపై చర్చకు సిద్ధమా చంద్రబాబు..?
()ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయావు
()విచారణకు భయపడి స్టే తెచ్చుకోవడం సిగ్గుచేటు
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్

హైదరాబాద్ః యుద్ధం ప్రారంభానికి ముందే తెల్లజెండా ఎత్తి వెన్నుచూపి పారిపోయే పిరికి సైన్యంలా టీడీపీ మారిపోయిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కాకముందే టీడీపీ తీరు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కనీసం మూడు వారాలు జరగాల్సిన సభను కేవలం మూడు రోజులు మొక్కుబడిగా నిర్వహించి రాష్ట్ర ప్రజల సమస్యలను చర్చకు రానివ్వకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.  ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో 36 ప్రజా సమస్యలపై చర్చకు రావాలని వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభా పక్షం అడుగుతుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు కాటకాలు, గృహ నిర్మాణం, హోదా, సంక్షేమ హాస్టళ్ల మూసివేత, సదావర్తి భూములు, మైనింగ్‌ మాఫియాలో టీడీపీ మంత్రుల పాత్ర వంటి 36 అంశాలపై చర్చ జరిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.

అసెంబ్లీని మొక్కుబడిగా నిర్వహించాలనే దుర్మార్గపు వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన జరిగి అవయవాలు లేని మొండెలా ఏపీ తయారైందని, అన్ని రకాలుగా ముందుకు పోవాలంటే విభజన హామీలు, ప్రత్యేక హోదా వచ్చి తీరాలన్నారు.  అన్ని పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో కేంద్రంతో పోరాటం చేయకుండా నాకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీలు వచ్చేశాయని బాబు పరిపాలనను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలపై కేంద్రంపై పోరాటం చేయకుండా మీడియాకు లీకులు ఇస్తూ, రాష్ట్ర సమస్యలను నీరుగారుస్తున్నారని ఫైరయ్యారు. తిరుపతి వెంకన్న సాక్షిగా  హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని , చంద్రబాబులు వెనకడుగు వేస్తే రాష్ట్రం నష్టపోతుందన్నారు. భవిష్యత్తులో ఏపీలో ఆకలిచావులకు కారణం కాకుండా ఉండాలంటే హోదా సాధించాల్సిందేనన్నారు.  హోదాపై పోరాటం చేయకపోతే బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
 
బాబు తప్పు చేశాడు కాబట్టే స్టే తెచ్చుకున్నాడు
దేనికైనా సై అంటూ సవాళ్లు విసిరే బాబు ఓటుకు కోట్ల కేసులో మాత్రం ఎందుకు పోరాడటం లేదని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసులో పీకల్లోతు ఇరుక్కుపోయిన ముఖ్యమంత్రి ...ఆడియో టేపుల్లో ఉన్న గొంతు నాదికాదని, చేతనైతే విచారణ చేసుకోమని తెలంగాణ ముఖ్యమంత్రికి సవాళ్లు విసిరివుంటే.. ఏపీ మొత్తం చంద్రబాబు వెనుక నిలబడి ఉండేదన్నారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ వాయిస్‌ బాబుదేనని ప్రపంచమంతా చెబుతుంటే... విచారణ ఎదుర్కోకుండా స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారని నిలదీశారు. ఆ గొంతు నాదికాదనే మాట బాబునోట ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. తాడిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకు అన్నట్లు చంద్రబాబు పరిపాలన తీరు ఉందని శ్రీధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్, భూమనలు తప్పలు చేయలేదు గనుకనే ధైర్యంగా విచారణను ఎదుర్కుంటున్నారని, చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నాడని విమర్శించారు. 
 
Back to Top