ద‌ద్ద‌రిల్లిన కౌన్సిల్ స‌మావేశం

అధికార పార్టీ ఆగ‌డాల‌ను ప్ర‌శ్నించిన వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు
గొల్లప్రోలు: నగర పంచాయతీ సమావేశం దద్దరిల్లింది. నగర పంచాయతీ చైర్మన్‌ శీరం మాణిక్యం అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఎజెండాలో ప్రవేశపెట్టిన 19 అంశాలతో పాటు సప్లిమెంటరీ ఎజెండాలో ప్రవేశపెట్టిన 3 అంశాలను కౌన్సిల్‌సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా సూర్యుడు మంచినీటి చెరువు శుభ్రపరచడానికి గతేడాది రూ. 9 లక్షలు మేర నిధులు దుర్వినియోగం చేశారని, చెరువు పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ తెడ్లపు చిన్నారావు, కౌన్సిలర్లు గంటా అప్పలస్వామి, రంధి కృష్ణ, గంధం నాగేశ్వరరావు, అమలదాసు శ్రీనివాసరావు ఆరోపించారు. చెరువు మొత్తం నాచు, చెత్తతో మురికిమయంగా మారిందన్నారు. ఇప్పుడు మరో రూ. 2లక్షలతో శుభ్రం చేస్తానని చెప్పడం హాస్యాస్ప‌దంగా ఉందన్నారు. గతేడాది వేసవిలో తాగునీటి సరఫరాకు రూ. 6.80లక్షలు ఖర్చుచేసినట్లు నిధులు డ్రా చేశార‌ని, పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకుందని నిలదీశారు. నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయకుండానే నిధులు పక్కదారి పట్టించారన్నారు. ఏ ప్రాంతాలకు నీటి సరఫరా జరిగిందో వివరాలు చెప్పాలని వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు పట్టుబట్టారు. సమాధానం చెప్పాల్సిన మున్సిపల్‌ ఏఈ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని నిలదీసారు.

షాపులపై ఎందుకంత ఉదాసీనత
పట్టణంలోని ప్రజల నుంచి పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, అవసరమైతే ఆస్తులు జప్తుచేస్తామని హెచ్చరిస్తున్న అధికారులు నగర పంచాయతీకు చెందిన షాపింగ్‌కాంప్లెక్స్‌ అద్దెలు ఎందుకు వసూలు చేయడం లేదని వైయ‌స్ఆర్ సీపీ ఫ్లోర్ లీడ‌ర్లు ప్రశ్నించారు. వ్యాపారులపై ఎందుకంత ఉదాసీనత కనబరుస్తున్నారని నిల‌దీశారు. వీధిలైట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమఫించన్లు సర్వే వివరాలు వెల్లడించాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. అనర్హులకు ఏ విధంగా పింఛన్లు మంజూరు చేస్తారని నిలదీశారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Back to Top