పత్తి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలి

హైదరాబాద్, అక్టోబర్ 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత సంస్థల ద్వారా హామీ ఇచ్చిన కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కూడా డిమాండ్ చేసింది. పార్టీ తెలంగాణ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జనక్ ప్రసాద్ సోమవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పత్తి రైతుల తీవ్ర కష్టాలలో ఉన్నందున, రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానం చేసినందున, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తక్షణమే కనీస మద్దతు ధర అయిన క్వింటాల్ కు 5,500 రూపాయలు చెల్లించి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలని శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు.

కనీస మద్దతు ధరను క్వింటాలుకు 4,080 రూపాయలుగా నిర్ణయించినప్పటికీ దళారులు కేవలం క్వింటాలుకు 3,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ పత్తి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని, దీని వలన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుకు క్వింటాలుకు కనీస మద్దతు ధర 5,500 రూపాయలు గిట్టేలా చూడాలని, దళారుల ప్రమేయం లేకుండా సీసీఐ లేదా ప్రభుత్వ అధీకృత సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసే ఏర్పాట్లు తక్షణమే చేయాలని వారు డిమాండ్ చేశారు.

దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేసే రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 17 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. అందువలన ప్రభుత్వం వాగ్దానం చేసిన బంగారు తెలంగాణ రావాలంటే పత్తి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనిపై త్వరలోనే మేము ముఖ్యమంత్రి, గవర్నర్ లను కలుసుకుని ఈమేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పిస్తాం అని వారు తెలిపారు.

హుదూద్ తుపాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో నష్టం వాటిల్లింది. పార్టీ నాయకులు త్వరలోనే ఆయా ప్రాంతాలను సందర్శించబోతున్నట్లు శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Back to Top