నిధుల దోపిడీపై నిగ్గు తేల్చండి

హైదరాబాద్ః ఎన్టీఆర్ జలసిరి పథకానికి లక్షలాది రూపాయలు ఖర్చుచేశామని ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తమని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆ పథకం ఎక్కడ కూడా అమలైన దాఖలాలు కనిపించడం లేదని చెప్పారు. పాడేరు మండ‌లంలోని గ‌బ్బంగిలో ఇందిరా జ‌ల‌ప్ర‌భ పేరు చెప్పి ఒకే ఒక బోరును త‌వ్వించార‌ని... దానికోసం లక్ష రూపాయలు అయ్యే ఖర్చును రికార్డుల్లో రూ. 50ల‌క్ష‌లుగా ఉన్నట్లు చూపించారన్నారు. ఇది ఎలా సాధ్య‌మో చెప్పాలని సంబంధిత మంత్రిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

గిరిజ‌నుల పేర  రాజకీయ  ప్రతినిధులు, అధికారులు కోట్లాది రూపాయ‌ల దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని నిప్పులు చెరిగారు. గిరిజనులకు ఎక్కడా కూడా సాగుచేసుకునేందుకు వ్యవసాయ భూమి చూపించలేదన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకంలో జన్మభూమి కమిటీలే ఆధిపత్యం వహిస్తున్నాయని ఈశ్వరి మండిపడ్డారు. దీని గురించి అధికారులను అడుగుతుంటే వివరాలు చెప్పేందుకు కూడా భయపడుతున్నారని అన్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఓ  కమిటీ వేసి విచారణ జరిపించాలని, అవినీతిపరులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

పుష్పశ్రీవాణి(కురుపాం ఎమ్మెల్యే)
త‌న నియోజ‌కవ‌ర్గంలో తీవ్ర మంచినీటి ఎద్ద‌డి నెల‌కొంద‌ని కురుపాం ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి స‌భ దృష్టికి తీసుకొచ్చారు. ఐదు మండ‌లాల్లో నెల‌కొన్న మంచినీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అధికారులను ప్ర‌శ్నిస్తే... రెండేళ్ల క్రితం నాటి ప్ర‌తిపాద‌న‌లు చూపిస్తున్నార‌ని చెప్పారు. అదేంటని ఆరా తీస్తే  ప్ర‌భుత్వం నుంచి నిధులు అందలేద‌ని వారు స‌మాధానం చెప్పార‌న్నారు. ఈ ఐదు మండ‌లాల‌కు గాను కేవ‌లం 107 బోర్లను ప్ర‌పోజ‌ల్స్ పెట్ట‌డం జ‌రిగింద‌ని, అందుకు గాను  రూ. 58 ల‌క్ష‌లు మాత్ర‌మే కేటాయించార‌ని తెలిపారు. ఎన్ఆర్‌డీడ‌బ్ల్యుఎఫ్ ఫండ్ప్ కింద మొత్తం 307 పైప్‌లైన్ల‌కి వాట‌ర్ ట్యాంక్స్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్ట‌డం జ‌రిగింద‌ని,  వీటికి సైతం నిధులు లేవ‌ని అధికారులు చెప్ప‌డం బాధ‌క‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి  సమస్యనుండి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. 

ముస్తఫా(గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే)
రూ. 423 కోట్ల ప్ర‌పంచ బ్యాంకు నిధుల‌తో తాగు నీటిప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు చుక్కనీరు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే ముస్తఫా ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.  ప్రాజెక్ట్ కాల‌ప‌రిమితి కూడా అయిపోయిందన్నారు. మెగా, ఎన్‌సీసీ కంపెనీల ఇంజ‌ినీర్లు గుంటూరు న‌గ‌రంలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ గుంత‌ల త‌వ్వి వ‌దిలేశార‌ని, మ‌రికొన్ని చోట్ల పైప్‌లైన్లు వేయ‌కుండా అలాగే పూడ్చివేశార‌ని ముస్త‌ఫా  అన్నారు. ఇప్ప‌టికైనా సంబంధిత అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టే విధంగా చూడాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. 

Back to Top