బాబు అవినీతి, మోసపూరిత పాలనను ఎండగడతాం

గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ 
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు

కర్నూలు :  చంద్రబాబు దోపిడీ పాలనపై ఇంటింటా ప్రచారం నిర్వహిస్తామని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో  నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న ‘గడప గడపకూ వైయస్సార్‌సీపీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు.  

అస్తవ్యస్తంగా  పాలన
పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా ఉందని అభివృద్ధి పనుల పర్యవేక్షణ అధికారులు గాలికొదిలేశారని విమర్శించారు. అధికారులందరూ ఎప్పుడూ సమావేశాలతో బిజీగా గడుపుతున్నారని, కలెక్టర్ కూడా సమయపాలన పాటించకపోవడంతో అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇది జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రజదర్బార్‌లో ఇచ్చే వినతుల్లో 10 శాతం కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని, సి.బెళగల్ ఎమ్మార్వోను అవినీతి ఆరోపణలపై బదిలీ చేసినా ఇంత వరకు రిలీవ్ చేయకపోవడంలో కలెక్టర్ ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

నాసిరకంగా అభివృద్ధి పనులు
సుల్తానీయా ఈద్గా, చిన్న ఈద్గాలో చేపడుతున్న పనులు  నాసిరకంగా ఉన్నాయని కేంద్ర పాలక మండలి సభ్యుడు హఫీజ్‌ఖాన్ చెప్పారు. ఇలా ప్రజాధనం వృథా చేయడం కంటే ఆ డబ్బును పేద ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తే బాగుండేదని హితవు పలికారు. ఎక్కడా ఈద్గాల వద్ద మెర్కురీలైట్లను కూడా ఏర్పాటు చేయకపోవడం ముస్లింపై  టీడీపీ నేతలకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు.

పార్టీ నగరాధ్యక్షుడు నర్సింహులు యాదవ్ మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ అనుచరుల కోసమే నగరంలో అభివృద్ధి పనులు చేపట్టారని, తద్వారా రూ. కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు .ఎక్కడో కృష్ణ పుష్కరాలు జరుగుతుంటే కర్నూలు నగరంలో వాటి పేరిటి రూ. 15 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని  దుయ్యబట్టారు.   ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు మద్దయ్య మాట్లాడుతూ.. గడప గడపకూ వెళ్లి చంద్రబాబు అవినీతి అక్రమాలను వివరిస్తామని, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు.
 
 ప్రజల అభిమతానికి భిన్నంగా పాలన
చంద్రబాబు ప్రజల అభిమతానికి భిన్నంగా పాలన సాగిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారాని  నాయకులు దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సదావర్తి భూముల అమ్మకంపై సీఎం మౌనం వీడి ఎందుకు విక్రయించాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాకు ఎన్నో వరాలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. బాబు రెండేళ్ల పాలన, అవినీతి అక్రమాలపై కరపత్రాలను ప్రతి గడపకూ పంచిపెడతామన్నారు.

తాజా వీడియోలు

Back to Top