రాష్ట్రంలో చతుర్ముఖ దుష్టపరిపాలన

  • అసత్యాలు, అబద్ధాలు, అసమర్థ, అప్రజాస్వామిక పాలన
  • రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచేస్తున్నారు
  • ఎమ్మెల్యేలు మొదలు ముఖ్యమంత్రి వరకు దొంగతనం చేస్తున్నారు
  •  కేసీఆర్, మోడీలంటే బాబుకు భయం..కారణం బొక్కలో వేస్తారని
  • హోదాను కేంద్రం ఎగ్గొట్టినా అడిగే దమ్ము, ధైర్యం బాబుకు లేదు
  • దుర్మార్గమైన పాలనను బంగాళాఖాతంలో కలుపుదాం
  • శ్రీధర్ పార్టీలోకి రావడం సంతోషం..తోడుగా నిలవండి
  • ద్వారకా తిరుమల బహిరంగసభలో వైయస్ జగన్ ప్రసంగం

పశ్చిమగోదావరిః రాష్ట్రంలో చతుర్ముఖ దుష్టపరిపాలన సాగుతోందని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాలన ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి, అసత్యాలు, అసమర్థ, అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని వైయస్ జగన్ ధ్వజమెత్తారు. ద్వారకాతిరుమలలో కోటగిరి శ్రీధర్ ను పార్టీలోకి ఆహ్వానించిన వైయస్ జగన్ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. వైయస్ జగన్ ఏమన్నారంటే...

ఇవాళ ద్వారకా తిరుమల అనగా..చిన్న తిరుపతి అంటారు. వెంకటేశ్వరస్వామి సన్నధిలో మన పార్టీలోకి శ్రీధర్‌ను ఆహ్వానిస్తున్నాను. శ్రీధర్‌ యువకుడు, ఉత్సాహవంతుడు. మంచి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక్కసారి తిరిగి చూస్తే..పరిపాలన గురించి ఆలోచన చేసినప్పుడు అభివృద్ధి అన్న అంశం గురించి ఆలోచన చేసినప్పుడు మనందరికి ఒక్కటి అర్థమవుతుంది. ఎవరైనా ఓటు వేయాలంటే..అభివృద్ధి ఏంటని ఒక్కసారి ఆలోచిస్తే..నిన్నటి కన్న ఇవాళ మనం బాగుంటే..ఇవాల్టికన్న రేపు బాగుంటామని భావిస్తే అప్పుడు అభివృద్ధి జరిగిందని గొప్పగా చెబుతాం. ఇవాళ బాబు పాలనలో అవినీతి జరుగుతుంది. అసమర్థ పాలన, అసత్యాల పాలన, అప్రజాస్వామిక పాలన సాగుతోంది. చతుర్ముఖ దుష్టపరిపాలన జరుగుతోంది. 

బాబు పాలన గురించి మాట్లాడాల్సి వస్తే మొదటగా అవినీతి పాలన
రాష్ట్రంలో ఎన్‌సీఏఈఆర్‌ ఇటీవల రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టు ఏంటో తెలుసా..దేశంలో మన ఏపీ అవినీతిలో నంబర్‌వన్‌లో ఉందని నివేదికలు ఇచ్చారు. బాబు పాలనంతా వ్యవస్థలను, మనుషులను, మీడియాను  మ్యానేజ్‌ చేసుకోవడం ప్రజలను మోసం చేయడం జరుగుతోంది. అవినీతి అన్నది ఇవాళ ఎలా జరుగుతుందే..దేశంలో ఇంతమంది సీఎంలు ఉన్నారు. ఎప్పుడైనా మనకు అనిపించిందా. ఒక ముఖ్యమంత్రి నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆ సమయంలో ఆయన ఖర్మబాగోలేక ఆడియో, వీడియో టేపులతో దొరికిపోవడం, ఆ తరువాత కూడా ఆ సీఎం రాజీనామా చేయకపోవడం, జైలుకు పోకపోవడం ఎక్కడైనా చూశామా? ఎక్కడా లేదు. మన రాష్ట్రంలోనే, అది కూడా బాబు కాబట్టే అలా జరుగుతోంది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తారు. అయినా ఆయన మీద యాక్షన్‌ తీసుకోరు. రాజధాని ఇక్కడ కాదు..అక్కడెక్కడో అంటూ నూజీవీడు అన్నారు. అసలైన రాజధాని వచ్చే ప్రాంతంలో తన బినామీలతో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన తరువాత ఎనిమిది నెలలకు రాజధాని అక్కడ కాదు..ఇక్కడ అని డిక్లెర్‌ చేస్తారు. రైతులందరు నష్టపోయారు. కానీ బాబు, తన బినామీలు గొప్పగా సంపాదించుకున్నారు. స్విస్‌ చాలెంజ్‌ పేరుతో తనకు నచ్చిన సింగపూర్‌ కంపెనీలకు వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు. రైతుల భూములను ధారాదత్తం చేస్తున్నారు. బాబు పాలనలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో నీళ్లు రావడం లేదు. అవినీతి ఏరులై పారుతోంది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రత్యేక జీవోలు తీసుకొని వస్తారు. డబ్బులివ్వాల్సిన పనిలేకపోయినా కమీషన్లు మాట్లాడుకొని అంచనాలు పెంచుతూ చెక్కులిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వేయం రూ.16 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు చేశారు. ఈ రెండున్నరేళ్లలో పెట్రోలు, డిజిల్‌ ధరలు తగ్గాయి, సిమెంట్, ఇసుక ధరలు తగ్గాయి. దీంతో తనకు రావాల్సిన కమీషన్లు రాకపోతాయని తెలిసి అన్యాయమైన కాంట్రాక్టర్‌ను కొనసాగిస్తాడు. తనకు నచ్చిన వారికి సబ్‌ కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారు. మద్యం నుంచి బొగ్గు వరకు, గుడి భూములను కూడా బాబు వదిలిపెట్టడం లేదు. సదావర్తి భూములను వేయ్యి కోట్ల ధర పలికే వాటిని రూ.22 కోట్లకు ఇచ్చే సన్నహాలు చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న కనకదుర్గమ్మ భూములను కూడా కారుచౌకగా ఇచ్చేస్తున్నారు. రాజధానిలో తాత్కాలిక భవనాలు, సెక్రటేరియట్‌ అంటాడు. ఇళ్లు కట్టడానికి అడుగు రూ.1500 అవుతుంది. కానీ సెక్రటేరియట్‌ కట్టడానికి రూ.10 వేలు ఖర్చు చేస్తున్నాడు. ఫైర్‌ బ్రిడ్, ఎ్రరచందనం పేరుతో దోచుకుంటున్నాడు. ఏ ఊర్లోకూడా ప్రభుత్వ పని చేయాలంటే నామినేషన్‌ పద్ధతి అప్పగిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రులు, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రే దొంగతనం చేస్తున్నారు. కన్సల్‌టెంట్ల పేరుతో దోచుకుంటున్నారు. రాజధాని భూమి పూజ కోసం వందల కోట్లు, గోదావరి, కృష్ణ పుష్కరాలకు రూ.3 వేల కోట్లు స్వాహా చేశారు. మూడు రోజుల పాటు సైన్స్‌ ఫెస్టివల్‌ అంటాడు రూ.200 కోట్లు ఖర్చు చేస్తాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రైవేట్‌ విమానాల్లో వెళ్తున్నాడు. సింగపూర్, దుబాయ్, స్విడ్జర్‌ల్యాండ్‌ వెళ్తాడు. మోడీ మొట్టికాయలు వేస్తాడని భయముంది. తెల్ల చర్మం వద్దంటాడు..తెల్ల జుట్టు ముద్దంటాడు. 

2వది..అసమర్ధ పాలన
ఎంత దారుణంగా అసమర్ధ పాలన జరుగుతుందటే..రైతులకు పంట రుణాలు రూ.48 వేల కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లు టార్గెట్లు పెట్టుకున్నారు. రబీలో రూ.36 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇచ్చింది కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే. బ్యాంకర్లను అడిగే దమ్ము దైర్యం బాబుకు లేదు. రాష్ట్రంలో పంటల సాగు సాధ్యం కావడం లేదు. రైతులకు మేలు చేయడం మరిచి, రైతుల భూములు ఎలా లాక్కోవాలో ఆలోచిస్తారు. అసమర్ధ పాలన అంటే ఏంటో తెలుసు..కేసీఆర్‌ను నిలదీస్తే బొక్కలో పెడతారని భయపడి..పక్క రాష్ట్రంలో కేసీఆర్‌ కృష్ణ, గోదావరి జలాలను పంపులు పెట్టి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదు. పార్లమెంట్‌ను సాక్షిగా చేస్తూ ప్రతిపక్షం, అధికార పక్షం ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని అడిగే దమ్మూ, ధైర్యం బాబుకు లేదు. గట్టిగా మోడీని అడిగితే ఎక్కడా సీబీఐ విచారణ చేయిస్తారోనని బాబుకు భయం. ఇవాళ ఏపీని విడగొట్టే సమయంలో విభజన చట్టంలో మనకు దుగ్గరాజుపట్నం ఎయిర్‌పోర్టు, కడపలో ఉక్కుపరిశ్రమ, విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామన్నారు. పోలవరం మేమే కడుతామని హామీ ఇచ్చారు. ఇవాళ గొప్పగా ఇచ్చారని దానికి ప్యాకేజీ అని కలర్‌ ఇచ్చి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎంఆర్‌వోను జుట్టుపట్టుకొని లాక్కొచ్చినా చంద్రబాబు చర్యలు తీసుకోడు. ఇదే జిల్లాలో విద్యార్థినులు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకు టీడీపీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని తెలుసు. అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. పూర్వం రోజుల్లో 108 నంబర్‌ కొడితే కుయ్‌..కుయ్‌ మంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేది. పెద్ద ఆసుపత్రుల్లో ఆపరేషన్లు ఉచితంగా చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించే వారు. ఇవాళ అంబులెన్స్‌ ఎప్పుడు వస్తోందో తెలియడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీపీ, షుగర్‌ పేషెంట్లకు మందులు అందడం లేదు. 104 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీని నడపలేని అసమర్థ పాలన నడపలేని సర్కార్‌ను చూస్తున్నాం. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదు. బీసీలకు ప్రేముందని బాబు డబ్బాలు కొట్టుకుంటున్నారు. బీసీలపై దివంగత నేత వైయస్‌ఆర్‌ చూపించారు. పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే పేదవాడి కొడుకు డాక్టర్, ఇంజనీరు కావాలి. నీవు ఉన్నత చదువులు చదువుతావా? నేను చదవిస్తానని వైయస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో చదివించారు. ఇవాళ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నాడు. ఇవాళ పేదవాడు చదవలేని పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నడపలేని సర్కార్‌ ఇది. రైతులకు నీళ్లు అందాలని వైయస్‌ఆర్‌ పాలనలో 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. మిగతా 20 శాతం పనులు పూర్తి చేయడం లేదు. మూడేళ్లు అయిపోవస్తోంది. ఇంతవరకు గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కట్టించిన పాపాన పోలేదు. వైయస్‌ఆర్‌ సువర్ణయుగంలో దేశంతో పోటిపడి 48 లక్షల ఇల్లు కట్టించారు. అసమర్ధపాలన అంటే వైయస్‌ఆర్‌ చేసిన పాలనను మళ్లి ఇవ్వలేకపోవడమే.

3వది అసత్య ,అబద్ధాల పాలన
బాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు. ఓట్లు వేయించుకునేందుకు మాత్రమే ప్రజలు పనికివస్తారు. ఆ సమయంలో బాబు నోట్లో ఎలాంటి మాటలోస్తాయో. టీవీల్లో ఎలాంటి ప్రచారం చేస్తారంటే...రైతు రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రైతు రుణాలు మాఫీ అయ్యాయా? అబద్ధాలు ఆడుతాడు, అసత్యాలు చెబుతారు. రైతులను వదిలిపెట్టడు, అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టడు. పొదుపు సంఘాలను నేనే స్థాపించానని చెబుతాడు. ఇవాళ నేను అడుగుతున్నా..మన ఇళ్లలో అక్క చెల్లెమ్మలు ఉన్నారు. అందరికి వాళ్లు పడుతున్నా బాధలు తెలుసు..వారి రుణాలు మాఫీ అయ్యాయా? , బాబు గెలవడానికి చిన్నపిల్లల ఓట్లు కూడా కావాలని..జాబు కావాలని బాబు రావాలన్నారు. జాబు రాకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతిఇస్తానన్నారు. విజయనగరం యువభేరిలో ఓ యువకుడు అడిగాడు. చంద్రబాబు నాకు రూ.64 వేలు బాకీ ఉన్నాడని, ఎవర్ని అడగాలని కోరాడు. అసత్యాల పరిపాలన ఏ స్థాయిలో జరుగుతుందంటే..హోదాను కేంద్రం ఎగురగొట్టింది. అడిగే దమ్ము, ధైర్యం బాబుకు లేదు. ప్యాకేజీ అని అసత్యాలు చెప్పారు. మనకు ఇవ్వాల్సిన దానికన్న ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజీ అంటారు. అలా కాకుండా మనకు ఇవ్వాల్సిందే ఇస్తే దాన్ని బాబు ప్యాకేజీ అని పేరు పెట్టాడు. నిన్న మైక్‌ పట్టుకొని బాబు క్లాస్‌ చెప్పాడు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నాడు. నిరుడు రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు అని బాబు బొంకాడు. మనం అందరం ఏపీలో ఉన్నాం. ఎక్కడైనా మనకు పరిశ్రమలు కనిపిస్తున్నాయా? ఎక్కడా లేవు. అయినా చంద్రబాబు మాత్రం మన చేవుల్లో క్వాలీఫ్లవర్‌ పెడుతున్నారు. ఇటీవల కేపీఎంజీ అనే సంస్థ ఓ సప్లిమెంటరీ ప్రవేశపెట్టింది. ఏపీలో బాబు పాలన మొదలైన తరువాత రాష్ట్రంలో 6 వేల పరిశ్రమలు ఉంటే బాబు పాలనలో 24 వేల పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. కారణం ఏంటంటే కరెంటు రేట్లు ముట్టుకుంటే షాక్‌ కొడుతుందట. ఇవాళ చంద్రబాబు అసత్య పరిపాలన ఏ స్థాయిలో ఉందంటే..పోలవరం కుడికాల్వను వైయస్‌ఆర్‌ హయాంలో 140 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగింది 30 కిలోమీటర్లు..ఇంకా 20 కిలోమీటర్లు అసంపూర్తిగా ఉండగానే లష్కర్‌లాగా గేట్లు ఎత్తి నదులు అనుసందానం చేశానని బొంకుతున్నాడు. బాబు ఎవర్ని వదిలిపెట్టడం లేదు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు తానే కనిపెట్టానని చెబుతాడు. సత్య నాదేళ్లకు నేనే ట్యూషన్‌ చెప్పడంతో ఆయన మైక్రోసాప్ట్‌ సీఈవో అయ్యాడని అబద్దాలు చెప్పిందే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బాబు పాలనలో అసత్య పాలన అంటే ఇదే.

4వది..అప్రజాస్వామిక పాలన
ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్‌లకు విలువలు లేవు. జన్మభూమి కమిటీలట. రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇచ్చేది వాళ్లేనట. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓట్లు వేసిన నాయకులకు ఎలాంటి హక్కులు లేవు. గిరిజనులకు రాజ్యంగం ప్రకారం ట్రైబ్స్‌ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలి. దాంట్లో సభ్యులంతా కూడా ఎమ్మెల్యేలు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉండాలి. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ తరుఫున ఏడుగురు ఎమ్మెల్యేలు గిరిజనులు ఉన్నారని, అందులో వారి అధికారం ఉంటుందని ఆ కమిటీ వేయడం లేదు. నియోజకవర్గ నిధులు కూడా తనకు కాని ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఇష్టమొచ్చిన వారికి నిధులు ఇస్తు వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. గిరిజనులు, దళితులకు అసైన్డ్‌ భూములు ఇచ్చి అండగా నిలివాల్సింది పోయి.. ఈ భూములు తన  అత్తగారి సొత్తు అన్నట్లు బాబు వాటిని ఎలా లాక్కోవాలని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడు. భూసేకరణ చట్టంలో మార్పులు తీసుకొని వస్తున్నాడు. చింతలపూడి ప్రాజెక్టు ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకే ప్రాజెక్టు పరిధిలో వేరు వేరుగా పరిహారం ఇస్తున్నాడు. పెద్ద వేగిలో రూ.46 లక్షలు, బావురుపాలెంలో రూ.54 లక్షలు ఇస్తున్నాడు. పక్కనే ఉన్న పోలవరం నిర్వాసితులకు వేరే ప్యాకేజీ ఇస్తున్నారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు డబ్బులతో ప్రలోభపెట్టి తన పార్టీలోకి లాక్కుంటున్నాడు. అలా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాల్సి ఉండగా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్లలో రాజీనామా చేయించే మళ్లీ ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం బాబుకు లేదు. ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయిస్తున్నాడు. మిగిలిన వారికి భయం పుట్టించేందుకు ప్రివిలేజ్‌కమిటీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యామా? ఇవాళ చంద్రబాబు స్వయాన రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాన్ని తన అధికార నివాసంగా చేసుకున్నాడు. గాంధేయపద్ధతిలో రిపబ్లిక్‌ డే రోజు క్యాండిల్‌ ర్యాలీ చేస్తే ఒప్పుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్‌పోర్టులోనే వెనక్కు పంపారు. ఎక్కడైనా రైల్‌రోకోలు చూశాం కాని, ఫ్లైట్‌ రోకో చేయించారు. ప్రత్యేకహోదా పోరాటానికి ఇవాళ మేధవులు, గ్రామ స్థాయి నుంచి అందరు సన్నధం కావాలి. అందులో భాగంగా శ్రీధర్‌ మన పార్టీలోకి రావడం సంతోషం. శ్రీధర్‌కు తోడుగా నిలవండి. దుర్మార్గమైన పాలనను బంగాళఖాతంలో కలుపుదాం.

 
Back to Top