ప్రజల మనసుల్ని విషపూరితం చేసే కుయత్నం

హైదరాబాద్ 27 సెప్టెంబర్ 2013:

గడిచిన రెండు రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వండివార్చిన రకరకాల కథనాలను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తే.. వాటిని ఆధారం చేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తిపోస్తున్నాయని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీని ఈ రాత్రి శ్రీమతి విజయమ్మ కలుస్తున్నారని ఓ చానెల్ వార్తను ప్రసారం చేస్తే దాన్ని పట్టుకుని టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారనీ, అసలు శ్రీమతి విజయమ్మ ఢిల్లీ వెళ్లిందే అందుకని చెబుతున్నారనీ తెలిపారు. సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళారని మాట్లాడారన్నారు. గతంలో బెయిలు తీర్పు వెలువడిన రోజుకూడా శ్రీమతి విజయమ్మ ఫోనుచేసి సోనియాకు కృతజ్ఞతలు చెప్పారని మాట్లాడారని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలపడానికి శుక్రవారం  శ్రీమతి విజయమ్మ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగుల సంఘం శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని కలిసి, విజ్ఞప్తి చేయడంతో ఆమె వెళ్లారని తెలిపారు.

ఎల్లో గ్యాంగ్ ఏ రకంగా దుష్ప్రచారాలకు పాల్పడతారో రుజువుచేసేందుకు మా దగ్గరో ఆధారం ఉందని పద్మ చెప్పారు. ఈరోజు రాత్రి పది గంటలకు శ్రీమతి విజయమ్మ సోనియా గాంధీని కలుస్తున్నారని ఆరోపిస్తున్నారనీ, కానీ ఆమె సాయంత్రం 5 గంటల విమానానికే హైదరాబాద్ బయలుదేరుతున్నారనీ చెబుతూ సంబంధిత టికెట్ ను చూపించారు. ఈ టికెట్ కూడా నిన్న సాయంత్రమే బుక్ చేశారని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో పెరుగుతున్న ఆదరణను తగ్గించలేక ఇటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. నాలుక ఉంది కదా అని తాటి మట్ట ఆడిస్తున్నట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ గారికి శ్రీమతి విజయమ్మ గారు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. పదహారు నెలలుగా శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచినందుకు టీడీపీ వారు ప్రతి రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారన్నారు. ఆ అవసరం మీకు తప్ప మాకు లేదని ఆమె స్పష్టంచేశారు. చంద్రబాబు గారి మీద కేసులు లేకుండా చేసినందుకు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నది తెలుగు దేశం పార్టీ అని చెప్పారు. మేం చెప్పుకోవాలనుకుంటే సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. న్యాయాన్నీ, ధర్మాన్నీ కాపాడటానికి ఒక సమయాన్ని నిర్దేశించిన అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు చెబుతామన్నారు. పదహారు నెలలుగా జైలులో ఉన్నప్పటికీ న్యాయస్థానాలను నమ్ముకున్నామే తప్ప ఏనాడూ కించపరిచేలా వ్యవహరించలేదన్నారు. పదహారు నెలల తర్వాత న్యాయం, ధర్మం గెలిచి మా పక్షాన నిలిస్తే.. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యినట్లు మాట్లాడుతున్నారనీ, ఇది తగదనీ హితవు పలికారు. న్యాయస్థానాల పట్ల టీడీపీకి ఏమాత్రం గౌరవం ఉందో దీన్నిబట్టి వెల్లడవుతోందన్నారు.  భాధ్యత లేని జర్నలిజాన్నీ, టీడీపీ విష ప్రచారాన్ని ప్రజల దృష్టికి తెస్తున్నామని చెప్పారు. ప్రజల మనసుల్ని విషపూరితం చేయాలనుకున్న మీ ఆలోచనకు ఇంతకుమించిన ఆధారముంటుందా అని ఆమె టీడీపీని నిలదీశారు. ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేస్తే నిజమవుతుందనే భ్రమలో వారున్నారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ పిచ్చివాళ్ళ ప్రేలాపనల్లా ఉన్నాయన్నారు. జర్నలిజంలో ఇదో దరిద్రపు సృజనాత్మకత అని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. అబద్ధపు కథనాలను వండి వార్చే దరిద్రపు సృజనాత్మకత, దీనిపై ఆధారపడిని టీడీపీ మతిమాలిన ప్రేలాపనలు చేస్తోందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏరకంగానైనా దెబ్బతీయాలని కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్నుతున్నాయని ఆమె ఆరోపించారు. సమైక్య ఉద్యమంలో మీ పాత్రేమిటని ఎవరూ అడగకూడదనేది మీ వైఖరిలా ఉందని ఎద్దేవా చేశారు. సమైక్య ఉద్యమానికి తూట్లు పొడుస్తున్న ఆ పార్టీలు సమైక్య వైఖరిని తీసుకున్న తమ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్నారు.

ఈ నెల 21న నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన తీర్మానాన్ని ఆమె చదివి వినిపించారు. 'రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిన ముఖ్యమంత్రి,, విభజన ప్రకటన వచ్చాక సమైక్యరాగం ఆలపించడం కంటి తుడుపు చర్చే. సమైక్యాంధ్రపై మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానించి దానిని కేంద్రానికి పంపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.' దీనికి టీడీపీ ఈరోజు వక్ర భాష్యం పలుకుతోందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలపై దుష్ప్రచారానికి దిగారని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందుగానే వారు రాజీనామాలు చేసిన విషయం మరిచారా అని ఆమె ప్రశ్నించారు. సమైక్య ఉద్యమంలో ఉద్యోగుల కోరికలను మన్నించి జగన్మోహన్ రెడ్డిగారు కూడా రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీ ఎన్జీవోల విజ్ఙప్తిని తమ పార్టీమాత్రమే మన్నించిందన్నారు. ముఖ్యమంత్రి సహా అంతా పదవులను పట్టుకుని వేలాడుతున్నారని చెప్పారు. ఇంతే కాకుండా తమ పార్టీని విమర్శించడం కంటే బురద జల్లడం బరితెగింపు మరొకటి ఉండదన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలనే విషయం ఈ రెండు పార్టీలకూ గుర్తురాకపోవడం విచారకరమని శ్రీమతి పద్మ ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీ మాట్లాడే వరకూ ముఖ్యమంత్రికి గానీ, చంద్రబాబుకు గానీ ఈ అంశం జ్ఒప్తికి రాకపోవడమేమిటన్నారు. కేంద్రంలో నేతలు క్యాబినెట్ తయారవుతుందంటున్నారు తప్ప... మేము ప్రక్రియను ఆపామనీ ఏ సీమాంధ్ర నేతా చెప్పడం లేదన్నారు. ఈ సందర్భంలో వైయస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలని సూచించిందన్నారు. దీన్ని వినకుండా తమ పార్టీని పలుచన చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయా పార్టీలను బద్‌నాం చేయాలంటే మాకు ఐదు నిముషాలు కూడా పట్టదన్న విషయం గమనించాలని కాంగ్రెస్, టీడీపీలను ఆమె హెచ్చరించారు. మీలాగా మేము బరితెగించి మాట్లాడదలచుకోలేదని స్పష్టంచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి గొడ్డలిపెట్టులా మారదలచుకోలేదన్నారు.

సీమాంధ్రలో బస్సు యాత్ర చేసిన చంద్రబాబు ఏమీ చెప్పకుండా ఢిల్లీ వెళ్ళి పొత్తులకోసం ప్రయత్నించి మా పార్టీని ఆడిపోసుకుంటారా అని ప్రశ్నించారు. ఆట ఆపవయ్యా పెద్దమనిషీ అంటే... చివరి బంతి వరకూ ఆడతానంటూ ముఖ్యమంత్రి మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలతో కాంగ్రెస్ చెలగాటమాడుతున్నప్పటికీ చంద్రబాబు గానీ, ముఖ్యమంత్రి గానీ ఆపలేకపోయారన్నారు. దీనివల్ల ఇరుప్రాంతాల వారినీ అవమానపరిచేలా వ్యవహరిస్తూ తప్పించుకు తిరుగుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిగారికి లభిస్తున్న ఆదరణ చూసి గజగజ వణుకుతున్నారని చెప్పారు. అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ రాసిన లేఖకు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీలు కూడా కేంద్రానికి లేఖ రాయాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

Back to Top