'రాయలసీమ'లో చిచ్చుకు కాంగ్రెస్ యత్నం

హైదరాబాద్ 07 ఆగస్టు 2013:

రాయలసీమ జిల్లాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిన్న సోనియాను కలిశారనీ, ఈరోజు ప్రధానిని కలుస్తున్నారనీ, రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి కూడా ఈరోజు సోనియాను కలుస్తానని చెప్పారన్నారు. వీరంతా సమైక్యాంధ్ర కోసం అధినేతను కలుస్తున్నానని చెబుతూ గ్రేటర్ రాయలసీమ ఇవ్వండని అడిగినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమను చీల్చమని సూచిస్తున్నామని కాంగ్రెస్ నాయకులే చెబుతుండడాన్ని ఆయన దీనికి ఉదాహరణగా తెలిపారు. ఇటువంటి కుయుక్తులకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. నాయకుల మధ్య చిచ్చు పెట్టి నాయకులను జిల్లాలవారీగా చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాయలసీమకే చెందిన ముఖ్యమంత్రిగారు నోరు మెదపకుండా అండర్ గ్రౌండ్‌లో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాయలసీమకు చెందిన మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయలసీమలో పుట్టిన వ్యక్తులేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. తమకు పదవులుంటే చాలన్నట్లుగా వీరి ధోరణి ఉందని పేర్కొన్నారు. రాయలసీమను చీల్చే కుట్ర జరుగుతుంటే వీరంతా గాడిదలు కాస్తున్నారా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఉంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి.. కాంగ్రెస్ అధిష్ఠానం మీరిలా చెప్పండని మాట్లాడిస్తున్నట్టుగా ఉందని శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద నాయకులుగా పేరొందిన వారు బయటకొచ్చి మాట్టాడాలన్నారు. లేకపోతే చారిత్రక ప్రాంతాన్ని చీల్చిన అపప్రథను మూటగట్టుకుని చరిత్ర హీనులుగా మిగులుతారని ఆయన హెచ్చరించారు.

చీలిక రాష్ట్రానికి కాంగ్రెస్ కానుక
విభజించి పాలించే పద్ధతిని కాంగ్రెస్ పాటిస్తుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఇందిరా గాంధీకి ఒక స్థాయి ఉందనీ,  ఆమె ఏది కావాలనుకుంటే అది చేయగలిగేవారనీ పేర్కొన్నారు. సోనియా గాంధీకి ఆ స్థాయి లేదు... ప్రజాదరణ లేని ఆమెకు ఓ ప్రాంతంలో ప్రజాదరణ ఉన్న వ్యక్తులు ఎదగకూడదనే దుర్బుద్ధితో సోనియా.. ఆమె చుట్టూ ఉన్న కోటరీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 33 ఎంపీ సీట్లను ఇచ్చి కేంద్రంలో అధికారం వచ్చేలా చేస్తే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి కానుకగా ఇస్తోందన్నారు. రాష్ట్రాన్ని విభజించడమే కాక.. ప్రాంతాల మధ్య చిచ్చు రగిలిస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పేదల హృదయాలను దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ గెలుచుకున్నారనీ, అప్పుడే కాంగ్రెస్ అధినేత్రికి ఇది బాధ కలిగించినట్టుందనీ చెప్పారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డిగారు ఎదిగితే కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలొస్తాయనుకుని కుట్రలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్ల పైన వస్తే ఆయన ఎక్కడ బలపడిపోతారోననే భయంతో ఇలా చేస్తున్నారన్నారు. ఎక్కడా బలమైన నాయకుడు ఉండకూడదనేది కాంగ్రెస్ సిద్ధాంతంగా కనిపిస్తోందని చెప్పారు. అంతర్రాష్ట్ర జల వివాదాలు ఏర్పడినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అందరికీ తెలుసు.. ఇది తెలిసీ తాగడానికి మంచినీరు దొరకని కింది ప్రాంతాల నాయకులు.. ఎన్నికలకు ఇంకా ఆర్నెల్లు సమయముంది కదా.. అప్పటిదాక పదవి అనుభవిద్దామనే ఉద్దేశంతో నోరు మెదపడం లేదన్నారు. పదవుంటే చాలని కాంక్ష వారిలో కనిపిస్తోందన్నారు. జర్మనీలో నాజీలు ఇలాగే విభజించి, మిగిలిన వారి నోళ్ళు మూసి ఎలా వారిని ఆక్రమించారో మార్టిన్ నీలోమార్ అనే ఆయన వివరించారు. ఆయన చెప్పిన కొటేషన్‌ను తెలిపారు.

'First they came for the communists. They didnot speak out because he is a communist. Then they came for a socialist. Then they didnot speak out as they were socialists. Then they for a trade union. They didnot speak out as they were trade unionist. Then to a Jews. They didnot speak out as he was not a jew. Then they came for a Catholic. They didnot speak as he was not a cathlic. At last no one left for him to speak.' 

రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం వైఖరి ఇలాగే ఉందన్నారు. మొదట జగన్మోహన్ రెడ్డిగారు వచ్చారు. మా పార్టీ కాదు కదా అని మాట్లాడలేదు కాంగ్రెస్. తరవాత ప్రాంతాలవారీగా నేతలు వచ్చారు. ప్రాంతాలు కదా అని పక్కన పెట్టారు. పార్టీల వారీగా వచ్చినప్పుడు వేరే పార్టీలు కదా అని మాట్లాడలేదు. ఇప్పుడది జిల్లాల వారీగా ఉద్యమం పాకింది. ఇప్పుడు మాట్లాడడానికి ఎవరూ మిగలలేదని ఎద్దేవా చేశారు.

1905లో బెంగాల్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు వందే మాతరం పుట్టుకొచ్చిందన్నారు. తదనంతరమే కాంగ్రెస్ పార్టీ అస్థిత్వాన్ని ఏర్పరుచుకుందన్నారు. ఆ కాలంలో బ్రిటన్ పాలకులు అనుసరించిన విభజించి, పాలించు సూత్రాన్నే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందని దుయ్యబట్టారు. ప్రాంతాలవారీగా చిచ్చుపెట్టడం ప్రజాస్వామ్య దేశంలో జరుగుతోందంటే ఎంత అవమానకరమో ఆలోచించుకోవాల్సి ఉందన్నారు. ప్రాంతాలవారీగా పెద్ద స్థాయి నాయకులతో అధిష్టానం మాట్లాడుతూ చిచ్చుపెట్టే వైఖరిని అనుసరిస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు నోరుమెదపక పోవడం తగదని హితవు పలికారు. అదే ప్రాంతానికి చెందిన ప్రతిపక్ష నేత సమస్యలు వచ్చినప్పుడు అటకెక్కి కూర్చుంటారన్నారు. ఈమధ్యే ఓరోజు బయటకివచ్చి, రాజధానిని నాలుగైదు లక్షల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టేశారన్నారు. చంద్రబాబు చిదంబరం, అహ్మద్ పటేల్, రేణుకా చౌదరి తదితరులతో ఏం మాట్లాడుకున్నదీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు గారికి ఎక్కువ ఆస్తులు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. అందుకనే ఆయన తన ఆస్తులు, తన రాజ గురువు బాగుంటే చాలనుకుని మౌనం పాటిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజ గురువుగారు నేరుగా గవర్నరు దగ్గరకు వెళ్ళి ప్రాంతాలను ఇలా విభజించాలని చెప్పారని తెలుస్తోందన్నారు. వ్యక్తిగతంగా బాగుండాలనే ఆలోచన తప్ప వేరేది వీరికి లేదన్నారు. రాష్ట్రంపై చిత్తశుద్ధి కానీ, తెలుగు ప్రజల సెంటిమెంటుకానీ వీరికి అవసరం లేదన్నారు. చిచ్చులు పెట్టి ప్రయోజనం పొందాలనుకోవడం తప్ప వేరే పని లేదని పేర్కొన్నారు. పెద్ద నాయకులనుకుంటున్న చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం..రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే అదైనా చెప్పండని కోరారు. సీబీఐ కేసులు పెడతామని బెదిరించినందునే చంద్రబాబు నోరుమెదపడం లేదనీ, దీనికి ఆయన వివరణ ఇచ్చుకోవాలనీ డిమాండ్ చేశారు. విభజించి పాలించడమనే ఈ సూత్రంతో మీరు ఎంతో నష్టపోతారని హెచ్చరించారు. ప్రజల సెంటిమెంటుతో  ఆటలాడుకోవద్దనీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ సీట్ల కోసం దానిని తాకట్టు పెట్టవద్దనీ శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యవహారశైలిని మార్చుకోకపోతే ప్రజలు వీరికి గుణపాఠం చెప్పేరోజు వస్తుందని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top