రాష్ట్రాన్ని విభజించే హక్కు కాంగ్రెస్‌కు లేదు

కడప, 22 ఆగస్టు 2013:

రాష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వైయస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానాన్ని ముందుగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తద్వారా కృష్ణా, సాగర్ డెల్టాల‌కు గోదావరి నీళ్ళు తేవాలన్నారు. ఈ రెండు డెల్టాలకూ గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమకు, ఎస్ఎల్‌బిసి, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారాను, రాయలసీమలో గాలేరు, నగరి, హంద్రీ - నీవా, తెలుగుగంగ లాంటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నికరజలాలు కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. సాగునీటి కోసం ప్రభుత్వం ముందుగా నదుల అనుసంధానం పూర్తిచేయాలన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ చేస్తున్న సమరదీక్షకు మద్దతుగా అవినాష్‌రెడ్డి తదితరులు కడపలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి గురువారానికి నాలుగవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మీడియాతో కాసేపు మాట్లాడారు. పోలవరం, దుమ్ముగూడెం టెయిల్‌ పాండ్‌ను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో సరిసమానమైన నగరాన్ని సీమాంధ్ర ప్రాంతంలో కచ్చితంగా ఏర్పాటు చేసి తీరాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌తో సమానంగా సీమాంధ్రలోని కొత్త నగరంలో తలసరి ఆదాయం ఉండాలని, రెవెన్యూ ఆదాయం కూడా అంతే స్థాయిలో వచ్చేలా చూడాలని అన్నారు. ఇవన్నీ చేసిన తరువాత మాత్రమే విభజన గురించి మాట్లాడే హక్కు గాని, చేసే హక్కు గాని వస్తుందన్నారు.

ఆరు నెలల తరువాత తన భవిష్యత్‌ ఏమవుతుందో తెలియని యుపిఎ ప్రభుత్వం ఏవేవో హామీలిస్తోందని అవినాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తమ భవిష్యత్‌ ఏమిటో తెలియని కాంగ్రెస్‌ నాయకులిచ్చే హామీలను తామెలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన చేసే వరకూ తాము నిరశన దీక్షను విరమించేది లేదన్నారు.

Back to Top