ప్రజా నాశనమే కాంగ్రెస్ స్టాండ్: వైయస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్ 05 ఆగస్టు 2013:

ప్రజలను నాశనం చేయడమనే స్టాండును కాంగ్రెస్ పార్టీ తీసుకుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ విధానం సక్రమంగా ఉందనీ, టీడీపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు విధానం లేదనీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యను ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్య చాలా చిత్రంగా ఉందన్నారు. టీడీపీ విధానం చంద్రబాబు మాటలలోనే వెల్లడవుతోందనీ, తాను చెప్పాల్సిన అవసరం లేదనీ పేర్కొన్నారు. సీమాంధ్ర టీడీపీలు సోమవారం ఢిల్లీలో ఏమాట్లాడారో విన్న వారికి వారి విధానం పూర్తిగా అర్థమవుతుందన్నారు. మా విధానం ఏమిటో తెలుసుకోవడానికి షిండేకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఖను మరోసారి తెప్పించుకుని చదువుకోవాలని ఆయన బొత్సకు సూచించారు. అసలు కాంగ్రెస్ విధానం ఏమిటో వివరించాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ ఆదివారం రాజమండ్రిలో మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఓడిపోతుందని చెప్పారనీ, రాష్ట్రాన్ని మూడుగా విభజించి మూడింటికీ సంయుక్త రాజధానిని ఏర్పాటుచేయాలనీ చెప్పారన్నారు. ఇదా కాంగ్రెస్ స్టాండ్? అని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమో, దేశ రెండో రాజధానో అవుతుందనీ కాకపోతే తాను రాజీనామా చేస్తానని కేంద్రమంత్రయిన చిరంజీవి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదా మీ స్టాండు అని నిలదీశారు. సమైక్యమే తమ విధానమని చెప్పి మీతో కూడా సంతకం పెట్టించుకున్నామని కొందరు చెబుతున్నారనీ.. ఇదా మీ విధానం అని బొత్సను అంబటి అడిగారు. సమైక్య రాష్ట్రానికి అనుగుణంగా మీరు సంతకం చేసి ఉంటే .. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మీకు ఏం స్టాండ్ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలందర్నీ సర్వనాశనం చేసే స్టాండునే కాంగ్రెస్ పార్టీ తీసుకుందని ఆయన మండిపడ్డారు.


సీమాంధ్రకు అన్యాయం జరిగిందని పార్లమెంటులో ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు గొడవచేస్తుంటే.. అదే ప్రాంతానికి చెందిన మంత్రులు వేడుక చూస్తున్నట్లుగా కూర్చున్నారని అంబటి చెప్పారు. వారు మంత్రులే కావచ్చు కానీ, కాస్త మనుషులుగా కూడా బతకాలని ఆయన హితవు పలికారు. ఇదేం స్టాండని ఆయన ప్రశ్నించారు. ఇది చెప్పడానికా మీరు ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర విభజనకు అనుగుణంగా అసెంబ్లీ రెండు సార్లు తీర్మానం చేసిందని ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారనీ, ఇంత అన్యాయంగా మాట్లాడతారేంటనీ అంబటి ప్రశ్నించారు. ఒక్కసారి కూడా అటువంటి తీర్మానమేదీ అసెంబ్లీ చేయలేదని స్పష్టంచేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు చెబుతున్నారనీ, అసలు రాష్ట్రంపై దిగ్విజయ్ సింగ్‌కు ఉన్న అవగాహనేమిటో వెల్లడయ్యిందనీ హేళన చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అరుణకుమార్... ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటున్నారన్నారు. ఈ బిల్లు నెగ్గదు.. శాసన సభలో మీరు వ్యతిరేకించండంటూ చెబుతున్నారన్నారు. శాసన సభలో ఇలాంటి తీర్మానం వీగిపోతే దేశంలో ఎక్కడా కొత్త రాష్ట్రం ఏర్పడలేదని ఆయన చెప్పారన్నారు. అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారని అంబటి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని వైరుధ్యాలు పెట్టుకుని తమకో స్టాండు ఉందని చెప్పుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలా ప్రజల్ని మీరు ఎంతకాలం మోసం చేస్తారని నిలదీశారు. ఈ వైఖరి చాలా దురదృష్టకరమన్నారు.


కేసీఆర్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేస్తే... బొత్సతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పడంలో ఉద్దేశమేంటని అంబటి అడిగారు. సీమాంధ్రులకు తాము రక్షణ కల్పిస్తామని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు పట్టించుకోవలసిన అవసరం లేదనీ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు నివసించడం లేదా అని వారు చెప్పడం చాలా అన్యాయంగా ఉందన్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుగు వారు హైదరాబాద్ నగరానికి రాలేదనీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాసులుగా వచ్చారనే విషయాన్ని వారు గుర్తెరగాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంతో వారికి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందన్నారు. సమస్యను పరిష్కరించే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టంచేశారు. చర్చలు లేకుండా, అందరి మనోభావాలు తెలుసుకోకుండా విభజన ప్రక్రియకు పూనుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పటికీ ఒకేలా ఉంటుందని అంబటి బల్లగుద్ది చెప్పారు. మేము రాష్ట్ర విభజన విషయమై రాసిచ్చిన విషయాన్నే ప్రస్తుతం అందరూ చెబుతున్నారని పేర్కొన్నారు. చిరంజీవి, జేడీ శీలం కూడా రాష్ట్ర విభజనపై సంప్రతింపులు జరగలేదని చెప్పారనీ, వీళ్ళంతా మంత్రులెలా అయ్యారనీ అంబటి అడిగారు. ఎవరికీ తెలియకుండా నిర్ణయం వెలువడి ఉంటే మీరంతా ఎందుకని తీవ్రంగా ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడికీ, ముఖ్యమంత్రికీ విభజన అంశం నెలరోజుల ముందే తెలుసంటున్నారనీ, అదే నిజమైతే.. ప్రజలకీ... కనీసం మీ క్యాబినెట్‌కి ఎందుకు చెప్పలేకపోయారని సందేహం వెలిబుచ్చారు. ఇప్పటికైనా వీరిద్దరూ వాస్తవాన్ని గమనించి.. సీమాంధ్ర ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలని సూచించారు. అలా కాకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పారు.

చంద్రబాబు క్షమాపణకు డిమాండ్
జరిగిందేదో జరిగిపోయింది... రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందామని ఇటు చంద్రబాబు, కేసీఆర్ చెబుతున్నారన్నారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగైదు లక్షల కోట్లకు అమ్మేసి వెళ్లిపోదామనే నీచమైన ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారనీ, ఇటువంటి వైఖరివల్ల సీమాంధ్ర ప్రజల మనోభావాలను చంద్రబాబు గాయపరచలేదా అని అంబటి నిలదీశారు. ఈ అంశంలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాకాకుండా జెండాలు పట్టకుని ఆ ప్రాంతంలో ఉద్యమమంటూ తిరిగితే మిమ్మల్ని నమ్మేదెవరన్నారు. అన్యాయం జరిగిందని మాట్లాడలేని పరిస్థితిలో చంద్రబాబు పడిపోయారని ఎద్దేవా చేశారు. మీరు దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడమేమిటని అంబటి ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డిగారు తెలంగాణ విభజనకు అంగీకరించారంటున్నారనీ.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణపై రోశయ్య కమిటీని వేసి... అందరితో మాట్లాడమని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రోజు జరిగిందేమిటి...విభజనకు ముందు ఎవరితో మాట్లాడారు అని అడిగారు. రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితిలోకి నెట్టి సోనియా, సీడబ్ల్యూసీ పైనుంచి నాటకం చూస్తున్నాయని విమర్శించారు. డాక్టర్ వైయస్ఆర్ మరలా సద్దుకుంటున్న దశలో అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేయడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  హోంమంత్రి షిండేకు మేము రాసిన లేఖ, చంద్రబాబు రాసిన లేఖ పక్కన పెట్టుకుని పరిశీలిస్తే తమ స్టాండ్ ఏమిటో స్పష్టమవుతుందని అంబటి చెప్పారు. అపోహలు తొలగించి రాష్ట్రాన్ని విభజించాలని మహానేత చెప్పారన్న  దిగ్విజయ్ వ్యాఖ్యకు ... మహానేత చెప్పారో లేదో నాకు తెలియదు... చెప్పి ఉంటే... ఇప్పుడు అపోహలు తొలగించి విభజించారా అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ పది తలల రాక్షసని అంబటి రాంబాబు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏ తలతో.. లేదా నాలుకతో మాట్లాడుతుందో తెలియదు గానీ చెప్పిందేమీ చేయదని స్పష్టంచేశారు. డాక్టర్ రాజశేఖర రెడ్డిగారి మరణానంతరం గుండెపగిలి మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం ఇస్తానని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఇచ్చిందా...ఈ అంశమొక్కటే చాలు ఇందుకు ఉదాహరణని ఆయన పేర్కొన్నారు.

మరో ప్రజా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసిన శ్రీమతి వైయస్ షర్మిలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు అంబటి ప్రకటించారు.

Back to Top