కాంగ్రెస్, టీడీపీల్లో నిజాయితీ కరవు: జగన్

హైదరాబాద్ 28 సెప్టెంబర్ 2013:

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో నిజాయితీ కనిపించడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్ర లాయర్ల జేఏసీ శనివారం సాయంత్రం తనను కలిసిన సందర్భంగా ఆయన లోటస్ పాండ్ నివాసంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని  ఆయన పార్టీలకు పిలుపునిచ్చారు. అందరం కలిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుందన్నారు. పంపకాల్లో పిల్లలకు తండ్రి న్యాయం చేయాలనీ లేదా ఎలా ఉన్నదాన్ని అలాగే విడిచిపెట్టాలనీ అంటూ ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించాలని సూచించారు. న్యాయం చేయలేనప్పుడు కొట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. పది జిల్లాలు నీటి కోసం కొట్టుకునే పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. 60శాతం మంది ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా ఓట్లు పోతాయని ఒకరు, సీట్ల కోసం ఒకరు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మౌనంగా ఉంటూ సమైక్య రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు పేరుకు రాజీనామాలు చేస్తున్నారు...తప్ప వారి ఆలోచనలో చిత్తశుద్ధి లేదన్నారు. ఒకవైపు చంద్రబాబు లేఖను వెనక్కి తీసుకోరు... రాజీనామా చేయరు అని ఎద్దేవా చేశారు. లేఖ వెనక్కి తీసుకున్న తరవాతే ఆ పార్టీని జేఏసీలోకి రానివ్వాలని ఆయన సూచించారు. టీడీపీ నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తేనే అనుమతించాలని కూడా కోరారు.

చదువుకున్న ప్రతి పిల్లాడూ ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నారన్నారు. రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తేవాలని పిలుపునిచ్చారు. పై రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండితేనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములకు నీళ్ళొస్తున్నాయనీ, ఇప్పుడు మధ్యలో మరో రాష్ట్రం వస్తే వీటికి నీరెలా వస్తుందనీ ఆయన ప్రశ్నించారు. కుప్పంనుంచి, శ్రీకాకుళం వరకూ నీళ్ళెక్కడినుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆదాయంలో సగం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఇది లేకపోతే సీమాంధ్రలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ జేఏసీ ఒక లేఖను తయారు చేయాలని ఆయన సూచించారు. దానిపై తానే మొదటి సంతకం పెడతానని ఆయన జేఏసీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అన్యాయం జరిగిందని చేస్తున్న ఆందోళన కానీ, జరిగిన అన్యాయం కానీ కేంద్రానికి కనిపించడం లేదా అని శ్రీ జగన్ నిలదీశారు. అందరికీ ఆమోదయోగ్యం కాకపోయినా రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే నీటి కొరత నెలకొందనీ, విడిపోతే పరిస్థితి ఏమిటనీ ఆయన ప్రశ్నించారు.

Back to Top