ఓటింగ్‌కు కాంగ్రెస్, టీడీపీలు పట్టుపట్టాలి

హైదరాబాద్ : ‌

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సభ్యులందరూ‌ విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావాలని ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం పట్టుపట్టి, అసెంబ్లీలో, బీఏసీ సమావేశాల్లో నిరసన వ్యక్తం చేసిన సీమాంధ్ర టీడీపీ సభ్యులు సహచర కాంగ్రెస్‌ సభ్యులతో కలిసి ఒక్కసారిగా మౌనం వహించడమే కాక, బిల్లుపై చర్చించాలంటూ ఎందుకు మాట మార్చారని ఆమె నిలదీశారు. ముసాయిదా బిల్లుపై ఓటింగ్‌కు కాంగ్రెస్‌, టీడీపీలు పట్టుపట్టాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాలు అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మరోసారి కుమ్మక్కై ఆరు కోట్ల మంది సీమాంధ్ర ప్రజలను, సమైక్యవాదులను నిలువునా మోసం చేశారని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ వారిద్దరూ సవరణలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బిల్లును వ్యతిరేకిస్తూ, 1 నుంచి 108 దాకా ఉన్న క్లాజులను తిరస్కరిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా సవరణలు ప్రతిపాదించినట్టు తెలిపారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ బీఏసీ సమావేశానికి రాకుండా ఇరు ప్రాంత నేతలను పంపించి డ్రా మాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

విభజన బిల్లుపై చర్చలో కూడా ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై దివంగత రాజశేఖరరెడ్డి, సభలో లేని శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై బురద చల్లుతున్నాయని శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యతీర్మానం చేస్తే పార్లమెంటు, సుప్రీంకోర్టులో ఒక ఆయుధంలా పనిచేస్తుందని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ మాదిరిగానే సభా 77, 78 సభా నిబంధనల కింద సమైక్య తీర్మానం చేయాలని సంతకం చేసిన మంత్రి శైలజానాథ్ శాసనసభా వ్యవహారాల‌ శాఖకు మారగానే స్వరం మార్చారని దుయ్యబట్టారు.

బీఏసీ సమావేశానికి డుమ్మా కొడుతున్న చంద్రబాబు అసెంబ్లీలో బొమ్మలా కూర్చుంటూ విభజనకు సహకరిస్తున్నారని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వని కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. బిల్లును తిరస్కరిస్తూ వారిద్దరూ సవరణలు ఎందుకివ్వలేదో నిలదీయాలని డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top