హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ముందుకు కదలాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు పిలుపునిచ్చారు. నగరంలో గెలుపు ద్వారా పార్టీని పటిష్టం చేయవచ్చని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ గ్రేటర్ విస్త్రతస్థాయి సమావేశం గురువారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో జరిగింది. పార్టీ హైదరాబాద్ జిల్లా పరిశీలకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదిరులు హాజరయ్యారు. మొదట దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.<br/>అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అసలు ప్రజల మద్దతే లేదన్నారు. ఇప్పుడు కూడా ఉద్యమం పేరుతోనే రాజకీయంగా గెలుపుసాధించారని అన్నారు. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి హామీలు నెరవేర్చలేదన్నారు. పింఛన్ల మొత్తం పెంచామని ప్రభుత్వం చెబుతోందని, 2004 తర్వాత వైఎస్సార్ ఎంతమందికి పింఛన్లు ఇచ్చారు..కొత్తగా వచ్చిన సీఎం కేసీఆర్ ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ పేరిట నగరంలో పేదలను సీఎం మోసం చేస్తున్నారన్నారు. రెండు లక్షల దరఖాస్తులు వస్తే, ఆరువేల దరఖాస్తులకే పరిష్కారం చూపారన్నారు.<br/>టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి గ్రేటర్ ఎన్నికల్లో ఆదరణ పొందాలన్నారు. వైఎస్ హయాంలోనే నగరంలో అభివృద్ధి సాధ్యమైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ నెల 20వ తేదీ లోపల వైఎస్సార్ సీపీ సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేయాలని నాయకులను ఆయన ఆదేశించారు. అర్హులకే కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రిజర్వేషన్లు ప్రకటించగానే అన్ని డివిజన్ల అభ్యుర్థులను ఒకేసారి ప్రకటిస్తామన్నారు.