ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు

గుంటూరు: శావల్యాపురం మండలం గుంటుపాలెం గ్రామ పంచాయతీలో అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మకై 49 ఓట్లు అన్యాయంగా తొలిగించారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా ఇష్టానుసారంగా తొలిగించటాన్ని పార్టీ నేతలు ఖండించారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి–గ్రామ సభలో జన్మభూమి కమిటీ సభ్యుల తీరుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. జన్మభూమి కమిటి సభ్యులు ప్రమేయంతో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని గుంటూరు జిల్లా ఎస్సీ కార్పోరేషన్‌ జిల్లా అధికారి (ఐఏఎప్‌) నరసరావుపేట డివిజనల్‌ జన్మభూమి ప్రత్యేక అధికారి యం.రామారావుకు వైయస్‌ఆర్‌ సీపీ మండల అధ్యక్షులు చుండూరి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.  

ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ మండల అధ్యక్షులు చుండూరి మాట్లాడుతూ గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు హవా పెరగటంతో అర్హులైన పేదలు అన్నీవిధాలుగా నష్టపోతున్నట్లు అవేదన వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చోని ఏకపక్షంగా చేయటాన్ని తప్పుపట్టారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నివాసాలు ఉంటున్నా వారి ఓట్లు తొలిగించటం భాధాకరమన్నారు. గత జన్మభూమిలో పింఛన్ల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులకు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాలు గ్రామస్థాయిలో రోజురోజుకు పెరుగుతున్నాయని అధికారుల దృష్టికి తెచ్చారు.  

Back to Top