రోజాపై టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు

కాల్‌మనీ కాలనాగులతో విమర్శలు చేయిస్తారా..?
చంద్రబాబు తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి నీచ రాజకీయాలు
మహిళలపై దాడుల్లో రికార్డుకు కృషి చేస్తున్న చంద్రబాబు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ

హైదరాబాద్‌: దాచేపల్లిలో అత్యాచారం జరిగిన బాలికకు న్యాయం చేయాలని పోరాడిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని పార్టీ అధికార ప్రతినిధి పద్మజ ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేనిS చంద్రబాబు తన అనుచరులతో ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. కాల్‌మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆమె పూర్తిగా తప్పుబట్టారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పద్మజ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అచ్చోసిన ఆంబోతులను ప్రతిపక్షంపై ఉసిగొల్పుతున్నారన్నారు. ఒక మహిళా ప్రజా ప్రతినిధిపై నీచంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 

అబద్ధాలు, అత్యాచారాలతో కొనసాగుతున్న పార్టీ టీడీపీ అని పద్మజ విమర్శించారు. చంద్రబాబు భార్య, కోడలు బ్రాహ్మణిపై నీచంగా మాట్లాడే సత్తా ఉన్నా.. సంస్కృతి, సంస్కారాలు అడ్డొస్తున్నాయని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ పార్టీ నేతలకు సంస్కారం నేర్పించారన్నారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ టీడీపీ నేతల అండతో నడుస్తుందని పచ్చమీడియాలో ప్రచురణ అయినా.. చంద్రబాబు స్పందించలేదని, అదే విధంగా ఏడీఆర్‌ అనే స్వచ్ఛంద సంస్థ మహిళలపై దాడులు చేసేది టీడీపీ నేతలేనని ఐదుగురి పేర్లు వెల్లడించినా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. వాటికి సమాధానం చెపాల్సింది పోయి బాధితులకు అండగా పోరాడుతున్న వారికి ఎదురుదాడికి దిగడం సమంజసం కాదన్నారు. 

చంద్రబాబు అవినీతి, మహిళలపై దాడుల్లో రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారేమోనని పద్మజ అనుమానం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ అధికారిపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదు.. దళిత మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై యాక్షన్‌ తీసుకోకపోవడం దారుణమన్నారు. ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల చిన్నారులపై జరుగుతున్న దాడుల్లో ఏపీ 2వ స్థానంలో ఉందని రికార్డులు చెబుతున్నాయన్నారు. దేశంలో నా అంత సీనియర్‌ నేత లేడని చెప్పుకునే చంద్రబాబు చుట్టూ కీచకులను పెట్టుకొని మొదటి ర్యాంక్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనుకున్నారా బాబూ అని నిలదీశారు.  

మహిళల రక్షణకు పాటుపడతానన్న చంద్రబాబు కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లోని కాలనాగులను ఉరితీయించగలడా అని ప్రశ్నించారు. అదే విధంగా మిస్టరీలుగా మిగిలిపోతున్న నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోగలవా అని నిలదీశారు. ఏడీఆర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం మహిళలపై దాడులు చేసే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులను సస్పెండ్‌ చేసి వారిపై చర్యలకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. నాపై ఒక్క కేసులేదు.. నిరూపిస్తే గుండుకొట్టుకుంటానని మాట్లాడిన బండారు సత్యనారాయణ ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌ పరిశీలించుకోవాలన్నారు. 
Back to Top