'సిఎం కిరణ్‌కు పంచాయతీ ఎన్నికల భయం'

తిరుపతి, 16 జూలై 2013:

పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో కాంగ్రెస్‌కు ఒక్క పంచాయతీ కూడా దక్కదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఓడిపోతామనే భయం ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డికి పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ఆయన గూండాలు, పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రౌడీషీటర్లను తిప్పి, ప్రత్యర్థులను ముఖ్యంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎన్ని అరాచకాలు సృష్టించినా చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకుంటుందని మిథున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Back to Top