కిరణ్, బాబు సమైక్య తీర్మానం పెట్టాలి

సోమల (చిత్తూరు జిల్లా):

తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగితే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లే అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తద్వారా రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితి నుంచి రక్షించాలని శ్రీ జగన్ కోరారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమలలో బుధవారం జరిగిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత సభలో పాల్గొనకుండా పారిపోవడానికి బదులు సమైక్య తీర్మానం చేయాలని శ్రీ జగన్‌ సూచించారు.

శాసనసభలో‌ ముందుగా తీర్మానాన్ని ఆమోదించి, ఎమ్మెల్యేలంతా ప్రతిపాదిస్తేనే రాష్ట్ర విభజన జరగాలని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. అయితే.. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసేసుకుని, తరువాత బిల్లుపై చర్చించండంటూ శాసనసభకు పంపినప్పుడు దాని మీద చర్చ జరిగితే మనం ఆ నిర్ణయాన్ని అంగీకరించినట్లు కాదా? అని శ్రీ జగన్‌ ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని విభజించడం లాంటి ప్రాధాన్యం ఉన్న అంశంపై కీలకమైన సమావేశాలు జరుగుతున్న తరుణంలో సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలాయన విధానం అనుసరిస్తున్నారని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. తమ తమ ప్రాంతాల అభిప్రాయాలకు అనుగుణంగా సభలో వ్యవహరించేలా ఆయా ప్రాంతాల టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత కీలకమైన సమయంలో చంద్రబాబు నాయుడు సభలో ఎక్కడా కనిపించడడంలేదని దుయ్యబట్టారు.

మన రాష్ట్రాన్ని ఇంత దారుణంగా అన్యాయం జరుగుతోందని మొత్తం దేశ ప్రజలందరికీ అర్థమైంది కాని సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడుకు వాస్తవ పరిస్థితి అర్థం కావడంలేదా అని శ్రీ వైయస్‌ జగన్‌ నిలదీశారు. తన కుమారుడు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవడానికి మన రాష్ట్రాన్ని సోనియా గాంధీ అడ్డగోలుగా విభజిస్తుంటే.. ఆమె కోరిక నెరవేరేందుకు చంద్రబాబు నాయుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

విభజన బిల్లుపై చర్చలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాల్గొనకపోవడంపై వస్తున్న విమర్శలను శ్రీ జగన్‌ తీవ్రస్థాయిలో తిప్పికోట్టారు. ఆ చర్చలో పాల్గొంటే రాష్ట్ర విభజన ప్రతిపాదనను అంగీకరించినట్లు అవదా? అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు, బలమైన రాష్ట్రాని‌కే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. కిరణ్, చంద్రబాబు నాయుడు సమైక్య తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, తద్వారా రాష్ట్ర ప్రజల అభిప్రాయం, అభిలాష ఢిల్లీకి స్పష్టంగా తెలియజేయాలని శ్రీ జగన్‌ డిమాండ్‌ చేశారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని కిరణ్, చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.

విశ్వసనీయత అంటే ఏమిటో బాబుకు తెలుసా? :
అధికారం ఇస్తే.. ఏదేదో చేసేస్తానంటూ చంద్రబాబు నాయుడు హామీలిస్తుండడాన్ని శ్రీ జగన్‌ ప్రస్తావించారు. అయితే.. ఆయన హామీలను ప్రజలు నమ్మే స్థితి లేదన్నారు. అసలు విశ్వసనీయత అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుసా?అని ఆయన ప్రశ్నించారు. ఏనాడూ ఒక్క నిజం చెప్పారా? ఒకే అబద్ధాన్ని వందసార్లు వల్లించి అదే నిజమని ప్రజలను నమ్మించడానికే ఆయన ప్రయత్నించారని ఆరోపించారు. తన హయాంలో విపరీతంగా పెంచేసిన విద్యుత్‌ చార్జీల బిల్లులు కట్టలేకపోయిన అన్నదాతలను జైలుకు పంపడానికి ప్రత్యేక జీఓ తెచ్చారని, పోలీసు కోర్టులు పెట్టించిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు తిన్నది అరగక చనిపోతున్నారంటూ హేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు చెప్పే మాటలను జనం ఏ విధంగా విశ్వసిస్తారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం వడ్డీ కూడా మాఫీ చేయని చంద్రబాబు ఇప్పుడు ఏకంగా రుణాలనే రద్దు చేస్తానని చెబుతున్నారని శ్రీ జగన్‌ ఎద్దేవా చేశారు.

చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాలని, పంటలకు నీటిని ఎక్కడి నుంచి తెస్తారని సీమగడ్డలోనే పుట్టిన సీఎం కిరణ్, చంద్రబాబులను ప్రతి విద్యార్థి, ప్రతి రైతూ చొక్కాపట్టుకుని నిలదీయాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అందేలా నిర్వహించిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఇప్పటికీ సజీవంగా కొలువై ఉన్నారని అన్నారు. అందరికీ ఆయన మంచి భవిష్యత్తును అందించే కార్యక్రమాలు నిర్వహించారు కనుకే ఆయన ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రశ్నే తలెత్తలేదన్నారు. ఆ మహానేత మరణంతో రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. ఏదేమైనా తాము సమైక్యాంధ్ర కోసం తుది వరకూ పోరాటం చేస్తామని శ్రీ జగన్‌ పేర్కొన్నారు.

ఎవరిని జైల్లో పెట్టాలి? ఎవరిని తప్పించాలి? రాష్ట్రాన్ని ఎలా విభజించాలి? ఎలా విడగొడితే ఎన్ని ఓట్లు, సీట్లు వస్తాయనే ఆలోచనతో ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయని శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య అవి జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో అందరం ఒక్కటై 30 లోక్‌సభా స్థానాలు కైవసం చేసుకుందామని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను కొనసాగిస్తానని ముందుకు వచ్చే వారినే ఢిల్లీ గద్దెపై కూర్చోబెడదామని అన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. మళ్ళీ ఢిల్లీ కోటను మనమే నిర్మిద్దాం అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top