అరచేతిలో వైకుంఠంలా రాజధాని ప్రజెంటేషన్‌

  • శాశ్వత రాజధానికి తట్టమట్టి వేయలేని వ్యక్తి చంద్రబాబు
  • స్పష్టత లేని చంద్రబాబు ప్రజెంటేషన్‌
  • రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులేమయ్యాయి
  • ప్రజలపై భారం పెంచేందుకు మళ్లీ వేల కోట్ల అప్పులు
  • ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌
వెలగపూడి: రాజధాని పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో స్పష్టత లేదని, కేవలం పేపర్‌లతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ప్రజెంటేషన్‌ కార్యక్రమం జరగిందన్నారు. రాజధాని ప్రజెంటేషన్‌ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా నూతన రాజధానికి అమరావతి అని పేరుపెట్టి తట్టమట్టి, ఒక్క ఇటుక ముక్క కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు. కేవలం తాత్కాలికం పేరుతో ప్రజలకు అందే సంక్షేమాల్లో తాత్కాలికం, రాజధాని భవనాలు తాత్కాలికం అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పోకడను చూస్తుంటే మతిమరుపు వ్యాధి ఉందేమోననే అనుమానం కలుగుతుందన్నారు. మొన్నటి వరకు సింగపూర్, జపాన్, చైనా, దావూస్, రష్యా అని పలు దేశాల పేర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు లండన్‌ నుంచి వచ్చిన నార్మన్‌ ఫాస్టర్స్‌ అనే సంస్థకు రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామని చెబుతున్నారన్నారు. లండన్‌ ప్రతినిధులతో రెండు గంటల పాటు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ప్రజెంటేషన్‌ ఇప్పించారన్నారు. రాజధానిపై విదేశీయులు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో స్పష్టత లేదని దుయ్యబట్టారు. 900 ఎకరాలు తీసుకొని వాటిలో 225 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు చేపడతారట. కోటి చదరపు అడుగుల్లో నవనగరాలు కడతారనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణంలో హెల్త్, జస్టిస్, స్పోర్ట్స్‌ సిటీస్‌ ఎక్కడ వస్తాయని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు. 

ఆ నిధులేమయ్యాయి చంద్రబాబూ
రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు పేపర్లు చూపించి ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి హడ్‌కో నుంచి రూ. 5 వేల కోట్లు, ప్రపంచ బ్యాంక్‌ నుంచి రూ. 4 వేల కోట్లు అప్పు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని పుష్కరాలకు, శంకుస్థాపనలకు విచ్చలవిడిగా వందల కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు అప్పుతీసుకుంటామని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో ఒక్కరికి తలసరి అప్పు రూ. 38 వేలు ఉందన్నారు. ఇప్పుడది రూ. 43 వేలకు పెరిగే అవకాశం ఉందన్నారు. మళ్లీ ఇప్పుడు అప్పులు తీసుకుంటే ప్రజలపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పరిహారం ఎలా అందిస్తారనేది కూడా స్పష్టత లేదన్నారు. రాజధానికి చంద్రబాబు ఎన్నిసార్లు వందల కోట్లు ఖర్చు చేసి శంకుస్థాపనలు చేశారో స్పష్టంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజధాని ఎక్కడ, ఎప్పుటిలోగా నిర్మిస్తారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top