సిట్ విచారణ ఓ బోగస్

  • భూ కబ్జాలో ముఖ్యమంత్రి, లోకేష్, మంత్రుల హస్తం ఉంది
  • సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది
  • బాబాబు సిట్ అంటే సిట్ అనే అధికారులతో విచారణ జరిపిస్తారట..?
  • భూ కబ్జాలకు పాల్పడిన దొంగలే విచారణ చేసి దోషుల్ని శిక్షిస్తారట..?
  • సిట్ వల్ల పేదలకు ఎలాంటి న్యాయం జరగదు
  • కేంద్రం జోక్యం చేసుకొని సీబీఐ విచారణకు ఆదేశించాలి
  • వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నంః విశాఖ భూ కుంభకోణంపై చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశించడంపై వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సిట్ విచారణ ఓ బోగస్ విచారణ అని అన్నారు. విశాఖపట్నంలో జరిగిన భూకుంభకోణంలో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల హస్తముందని ప్రజలంతా భావిస్తున్న సమయంలో దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం భూ స్కాంను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. మీరు సిట్ అంటే సిట్ అనే అధికారులతో విచారణ చేపిస్తే ప్రజలకు ఏవిధంగా న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా భూదందాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. సిట్ లో పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ డిపార్ట్ మెంట్ ఉంటారట. వీరు నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేస్తారట. అసలు దొంగలే క్యాబినెట్ మినిస్టర్ లని ప్రజలనుకుంటుంటే..ఆ దొంగలే విచారణ చేసి దోషుల్ని శిక్షిస్తారని చెప్పడం హాస్యాస్పదమని గుడివాడ అమర్నాథ్ అన్నారు. 

భూ కుంభకోణానికి సంబంధించి సమావేశం నిర్వహించిన చంద్రబాబు జిల్లా మంత్రి గంటాను ఎందుకు పిలవలేదని నిలదీశారు. భూ దందాలో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యపాత్ర పోషించాడని ఇందుకు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు లోకేష్ సహకరించాడని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. పోలీసు అధికారే భూదందా చేస్తున్నాడని స్వయంగా మీ మంత్రి అయన్నపాత్రుడు చెబితే, అలాంటి సిట్ లో పోలీసులు భాగస్వాములు ఉంటే ఏరకంగా న్యాయం జరుగుతుంది..? భూముల రికార్డులు పోయాయని చెబుతున్న అధికారులే అందులో భాగస్వాములుగా ఉంటే పేదలకు ఏవిధంగా న్యాయం జరుగుతుంది..? అని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఏదో నాలుగు గోడల మధ్య తూతూమంత్రంగా విచారణ జరిపి భూ కబ్జానే జరగలేదని చెప్పే కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అమర్నాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

విశాఖ సరిహద్దుల్లో దాదాపు 11 ప్రధాన మండలాల్లో 2,3 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైతే....కేవలం  కొమ్మాడ, మధురవాడల్లో విచారణ జరపడమేంటని ప్రశ్నించారు. అసలు భూ కబ్జానే జరగలేదని చెప్పేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, దళితుల అసైన్డ్ భూములు, ప్రభుత్వ బూములు, దేవుడి మాన్యాలు, గుడి-గుడిలోని లింగాన్ని సైతం మంత్రులు మింగేస్తుంటే ముఖ్యమంత్రి దగ్గరుండి ప్రోత్సహించడం దారుణమన్నారు.  ఎన్నికల్లో మీరు చెప్పిన మాటలేంటి..? మీరు చేస్తున్నదేంటి..? కడపనుంచి గూండాలు వచ్చి స్థలాలు లాక్కుంటారంటూ ప్రాంతాల మధ్య  చిచ్చుపెట్టాలని చూసి వైట్ కాలర్ నేరానికి పాల్పడ్డారని టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.  చట్టవిరుద్ధంగా జీవోలు విడుదల చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరిట రైతులు, దళితుల భూములు దోచుకుంటున్నారు. రికార్డులను మార్చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లు భూములను దోచుకుంది కళ్లకు కట్టినట్టు కనబడుతుంటే.....ఇంత అన్యాయం జరుగుతుంటే..చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయలేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం దుర్మార్గమన్నారు. వైయస్ఆర్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపక్షంగా మీరు ఆరోపణలు చేస్తే దానిపై సీబీఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఘనత వైయస్ఆర్ దని అమర్నాథ్ గుర్తు చేశారు.

తెలంగాణలోని మియాపూర్ లో  700 ఎకరాల ల్యాండ్ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ కోరిన మీరు...విశాఖలో లక్షల ఎకరాలు కబ్జా చేస్తే ఎందుకు కోరడం లేదని బాబును కడిగిపారేశారు. కలెక్టర్ భూముల రికార్డులు పోయాయని బహిరంగంగా చెప్పాక కూడ డిప్యూటీ సీఎం,  రెవెన్యూ మంత్రి ఇంతవరకు విశాఖకు ఎందుకు రాలేదని అమర్నాథ్ ప్రశ్నించారు.  రికార్డులు పోయాయని కలెక్టర్ చెబుతుంటే మీకు బాధ్యత లేదా..? ముఖ్యమంత్రి వెళ్లొద్దని చెప్పారా..? దాని జోలికి వెళితే మీ అంతుచూస్తామని మిమ్మల్ని భయపెట్టారా..? ముఖ్యమంత్రితో సహచరుడిగా 78నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రెవెన్యూమంత్రిగా ఉండి ఎందుకు విశాఖవైపు కన్నెత్తిచూడలేదని అమర్నాథ్ కేఈ కృష్ణమూర్తిని నిలదీశారు .  దోషులను వదలొద్దని గంటా స్టేట్ మెంట్ ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. 

ప్రభుత్వ ధనాన్ని బ్యాంకుల్లో పెట్టి భూములు కాజేస్తున్నారు. రికార్డులు మార్చేస్తున్నారంటూ టీడీపీపై అమర్నాథ్ ఫైర్ అయ్యారు. మంత్రులు, శాసనసభ్యులే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, లోకేష్ చెప్పుచేతల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని స్పష్టంగా వాస్తవాలు కనిపిస్తున్నప్పుడు చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రభుత్వానికి చురక అంటించారు. పేదలకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకునేందుకు  వైయస్సార్సీపీ నాయకత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని,  ముదపాకలో అసైన్డ్ రైతులతో మాట్లాడామన్నారు. అవసరమైతే వైయస్ జగన్ ను విశాఖకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా స్మార్ట్ సిట్ పేరుతో విశాఖలో టీడీపీ నేతలు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని....ప్రధాని జోక్యం చేసుకొని సీబీఐ ఎంక్వైరీకి పిలవాలని డిమాండ్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top