నగరిలో టీడీపీ నేతల అవినీతికి సీఐ అండ

హెవీ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొని మహిళ మృతి
బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే రోజా ఆందోళన
మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న రోజా.. 
సీఐని సస్పెండ్‌ చేయడంతో పాటు.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ 

నగరి: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నలో జరుగుతున్న అవినీతి భాగోతానికి ఒక అమాయక మహిళ బలైంది. నగరి నియోజకవర్గంలో గతంలో మూసివేసిన క్వారీలను టీడీపీ నేతల అండతో.. పోలీసుల సహాయంతో కొందరు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం క్వారీ నుంచి హెవీ లోడ్‌తో అతివేగంగా వస్తున్న టిప్పర్‌ ఢీకొని మహిళ దుర్మరణం చెందింది. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. మహిళ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. బాధితురాలి పిల్లలకు తల్లిని, భర్తకు భార్యను తెచ్చివ్వగలరా? అని పోలీసులను ప్రశ్నించారు. శవ పంచనామా కూడా చేయకుండానే మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి ఎలా తీస్తారని నిలదీశారు. రోజా ఆగ్రహానికి గురి కావడంతో పోలీసులు మృతదేహాన్ని ఘటనా స్థలానికి తీసుకొని రోడ్డుపై పడకోబెట్టారు. స్థానిక సీఐ అండతో క్వారీ మళ్లీ తెరిచారన్నారు. అవినీతి పరులకు సీఐ అండగా ఉంటూ.. అరాచకాలు సృష్టిస్తూ.. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాడన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని కదలినిచ్చేది లేదన్నారు. తక్షణమే అవినీతికి పాల్పడుతున్న సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top