చుక్క వాన లేదు.. కరెంటూ ఉండదు

ఇనపరాజుపల్లి (గుంటూరు జిల్లా) : ‘మూడు గంటలకు మించి‌ విద్యుద్ రాదు. అది కూడా మూడుసార్లు‌ మాత్రమే ఇస్తారు. పొలానికి పోయి ఎదురు చూసీ చూసీ ఇంటికి వస్తే అప్పుడు కరెంటొస్తది. పరిగెత్తుకొని పొలానికి పోయేసరికి మళ్లీ పోద్ది. పూతల మీద చుక్క వానచినుకు రాలలేదు.. తీరా పంట కోతకొచ్చాక కళ్లాల మీద వానలు పడుతున్నాయి. మూడు ఎకరాల్లో.. అన్ని పెట్టుబడులూ కలుపుకొని రూ.2.10 లక్షలు ఖర్చు చేసి మిరప వేస్తే 18 క్వింటాళ్లు వచ్చింది. రూ. లక్ష వచ్చింది. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఏం చేసి నా పిల్లలను బతికించుకోను?’ - ఇనపరాజుపల్లికి చెందిన రైతు కోరకూటి వెంకటేశ్వర్లు అవేదన.

‘భూమినే నమ్ముకున్న. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడాది పండకపోతుందా! అని అప్పులు చేసి మూడు ఎకరాల్లో మిరపతోట పెట్టినా. అదను మీద వాన పడలేదు. కరెంటు లేక మొక్కలు ఎండిపోయాయి. ఆయిల్ ఇంజ‌న్‌పెట్టి తోట తడిపితే ఎకరానికి రూ. 2,500 కిరాయి. ఆరు తడులు పెట్టినా.. నేను, నా కొడుకూ..నా భార్యా అందరం రెక్కలు ముక్కలు చేసుకుంటే ఎకరానికి 8 క్వింటాళ్ల మిరప పట్టింది. దాన్ని తీసుకొని మార్కెట్‌కు పోతే కాటా పెట్టక ముందే వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది. తడిసిన మిరప కొనబోమని చెప్తే తీసుకొచ్చి ఇంటి ముందు పోసినా. పంటను నమ్ముకొని నాశనమై పోయినాం’... - తక్కెళ్లపాడు మిరప రైతు అంజిరెడ్డి కన్నీళ్ళివి.

గుంటూరంటే ముందుగా గుర్తుకొచ్చేది మిర్చి ఘాటు. దయలేని పాలకుల ఏలుబడిలో ఆ మిరపే ఇప్పుడు అప్పుల పాలు చేసి రైతుల కంట ఇలా కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రజల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్ ‌కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో ఇలా రైతన్నలు ఆమె వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర 74వ రోజు సోమవారం శ్రీమతి షర్మిల మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇనపరాజుపల్లి శివారులో శ్రీమతి షర్మిల మిరప కళ్లాలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అక్కడే ఉన్న రైతులను పలకరిస్తే ‘మూడేళ్ల నుంచీ పంట లేదమ్మా.. భూమిని నమ్ముకొని నాశనమైపోయాం.. ఆదుకునే దేవుడు రాకుంటే ఆత్మహత్యలకు అంతే ఉండదమ్మా’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

మహానేత రాజన్న రాజ్యంలో రైతే రాజు :
మిరప రైతు కన్నీళ్లను చూసిన శ్రీమతి షర్మిల గాదెవారిపల్లిలో జరిగిన రచ్చబండలో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరును ఘాటుగా విమర్శించారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని, రాజన్న రాజ్యంలో రైతే రాజు అని భరోసా ఇచ్చారు. ‘ఇది మనసులేని ప్రభుత్వం.. వీళ్లు రైతుల రక్తాన్ని పీల్చి తాగుతున్నారు. వాళ్లకు ఉన్న సమయమంతా పదవులు కాపాడుకోవడానికి, ఢిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు కాంగ్రె‌స్ ప్రభుత్వంతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారు’ అని‌ శ్రీమతి షర్మిల మండిపడ్డారు.

అన్నదాతల కన్నీళ్లు కనిపించడం లేదా?:
‘చంద్రబాబూ మీరు కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా? మరి మీకు ఈ ప్రజల కన్నీళ్లూ, కష్టాలూ కనిపించడం లేదా? అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. మరికొంత మంది రైతన్నలు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఈ ప్రభుత్వంపై ఎప్పుడు అవిశ్వాసం పెడతారో చెప్పండి. మీరు అవిశ్వాసం పెట్టరు. ఎందుకంటే ప్రజలు ఎటు పోయినా మీకు పట్టదు. మీరు బాగుంటే చాలు. అవిశ్వాసం పెట్టకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడతారు. అందుకు ప్రతిఫలంగా ఈ ప్రభుత్వం మీరు చేసిన అవినీతి పనుల మీద ఎలాంటి విచారణా వేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అది మీ ఇద్దరి మధ్యా కుదిరిన చీకటి ఒప్పందం’ అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

విలువైన ప్రాణాలు, భూమిని పోగొట్టుకోవద్దు :
రైతులను ఉద్దేశించి శ్రీమతి షర్మిల మాట్లాడుతూ..‘అమ్మా..! అయ్యా..! ఒక్క మాటైతే భరోసా ఇచ్చి చెప్తున్నా.. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ‌తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వస్తుంది. రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోకుండా రూ. 3,000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు. అంత వరకు ఓపిక పట్టండి. దయచేసి మీ విలువైన ప్రాణాలు, భూమిని పోగొట్టుకోవద్దు’ అని కోరారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 74వ రోజు సోమవారం ఉదయం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తక్కెళ్లపాడు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మాచర్ల నియోజకవర్గంలోని కాచవరం, ఇనపరాజుపల్లి, గాదెవారిపల్లెల మీదుగా కొనసాగింది. శ్రీమతి షర్మిల 11.8 కిలోమీటర్ల మేర నడిచి.. రాత్రి 7.15 గంటలకు చినకొదమగండ్ల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,046.8 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశారు.

శ్రీమతి షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆ‌ర్‌.కె., తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, ఆతుకూరి ఆంజనేయులు, పి. గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీ‌న్ తదితరులు ఉన్నారు.
Back to Top