చివరి వరకూ వైయస్ కుటుంబంతోనే ఉంటా

  .. హైదరాబాద్, ‌14 సెప్టెంబర్‌ 2012: రాజకీయాల్లో ఉన్నంత వరకూ తాను దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని, వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆమె గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌కు దూరంగా ఉన్నట్లు, పార్టీకి రాజీనామా చేసినట్లు కొన్ని టీవీ చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయని, అవి పూర్తిగా తప్పు అని ఖండించారు. 

ఒక మాట కోసం కట్టుబడి వైయస్ కుటుంబంతో కలిసి పయనిస్తున్నానని, అందు‌ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నానన్నారు. తాను అనారోగ్యంతో ఉండటం వల్లనే వైయస్‌ విజయమ్మ హైదరాబాద్‌లో చేసిన ఫీజు దీక్షకు హాజరు కాలేకపోయానని తెలిపారు. తీవ్రమైన వెన్ను నొప్పితో తాను బాధపడుతూ ఉండటం వల్ల విశ్రాంతి అవసరమైందని, తన భర్తకు వరంగల్‌లో పనులున్నందున హాజరుకాలేకపోయారని ఆమె పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకూ శాయశక్తులా కృషి చేస్తామని, తద్వారా వైయస్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఆమె అన్నారు.
Back to Top