చింతమనేనీ ఎంక్వైరీకి సిద్ధమా..?

  • క్లీన్‌చిట్‌ వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
  • దెందులూరు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అబ్బయ్యచౌదరి
  • రెండో రోజు కొనసాగుతున్న దీక్ష.. కోటగిరి సంఘీభావం
పశ్చిమగోదావరి: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడలేదని చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సీబీ సీఐడీ ఎంక్వైరీకి సిద్ధమా అని దెందులూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త అబ్బయ్యచౌదరి సవాలు విసిరారు. చింతమనేని ఇసుక మాఫియాపై విచారణ జరిపించాలని, ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ పెదవేగి మండలం రాయన్నపాలెంలో అబ్బయ్యచౌదరి చేపట్టిన దీక్ష రెండవ రోజు కొనసాగుతోంది. దీక్షకు ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. దెందులూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, గోపన్నపాలెంలో నిరాహారదీక్ష చేస్తుంటే పోలీసులు, అధికారులు టీడీపీతో కుమ్మకై దీక్షా వేదికను కూల్చివేశారన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బీరాలు పలుకుతున్న చింతమనేని ఎంక్వైరీకి సిద్ధపడాలన్నారు. విచారణలో క్వీన్‌ చిట్‌ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. 
దోపిడీ చేయమని ఉసిగొల్పుతున్నాడు...
అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను దోచుకోండి అని ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతున్నారని కోటగిరి శ్రీధర్‌ విమర్శించారు. ఇసుక, మట్టి మాఫియాపై అనేక సార్లు కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా పదిరోజులు ఆపడం మళ్లీ మొదలు పెట్టడం ఇదే తంతు కొనసాగుతుందన్నారు. పక్కనే ఉన్న చెరువు 60 ఎకరాలు తవ్వించిన చింతమనేని తట్టెడు మట్టి తీయలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ పాలన వస్తుందని, ఇసుక, మట్టి మాఫియాపై ఎంక్వైరీ వేసి అవినీతితో భాగస్వామ్యం ఉన్నవారందరికీ చట్టపరమైన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే దెందులూరు వచ్చి చింతమనేని మాఫియాలపై ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top