టీడీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

ఢిల్లీ ఫలితాలు ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి
పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి


చిత్తూరు: టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు, విధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోందని చిత్తూరు జిల్లా  పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. వార్డుబాట కార్యక్రమంలో భాగంగా  ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం నిధలు మంజూరు చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. ఎన్నికల హామీలను విస్మరించి నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో రైతాంగం పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారని, తీవ్రమైన కరువు నెలకొనడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సహకార సంఘంలోని డెయిరీల గురించి పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల విలువైన యంత్రాలు తుప్పుపడుతున్నాయని చెప్పారు.  చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ఖాయిలాపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిలువునా ముంచేవారన్నారు. కొత్త కొలువుల సంగతి పక్కనబెడితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మారిన విజయవాడ, గుంటూరు మినహా బాబుకు రాష్ట్రంలో ఏదీ కనబడలేదని విమర్శించారు. ఢిల్లీ ఫలితాలను చూసైనా కళ్లు తెరవాలని, లేకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ నారే వెంకట్రమణారెడ్డి, ఎంపీపీ కే. మహితాఆనంద్, జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ నాయకులు బీడీ. నారాయణరెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, ఎం. భానుప్రకాష్‌రెడ్డి, శ్రీరాములురెడ్డి, సుంకర చక్రధర్, ఉదయ్‌కుమార్, పూలకుమార్, ఎస్.గౌస్‌బాషా, రెడ్డిబాషా తదితరులు పాల్గొన్నారు.
Back to Top