ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కష్టం..!

బినామీల పేర్ల‌పై ఉన్న భూములు బినామీలే తీసుకోండి

ప్ర‌జ‌ల డ‌బ్బుతో మీరైనా బాగుప‌డండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి

 

హైద‌రాబాద్‌:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన
ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల్లో గెలిస్తే అర్థ‌గుండు చేయించుకుంటాన‌ని
చంద్ర‌గిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి స‌వాల్
విసిరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌లో
ఆయ‌న మాట్లాడారు. ఆంధ్ర‌ప్రదేశ్ చరిత్ర‌లో ఏ సీఎం చేయ‌ని మోసాలు, చెప్ప‌ని అబద్దాలతో న‌య‌వంచ‌క, అనైతిక‌మైన పరిపాల‌న ఒక్క చంద్ర‌బాబు మాత్ర‌మే
చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త, ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకొని ప్ర‌జ‌ల‌సంక్షేమాన్ని
విస్మ‌రిస్తున్నార‌ని అన్నారు. ఇసుక‌, మ‌ద్యం, రాజ‌ధాని ఇలా అన్నిర‌కాల మాఫియాల‌కు ఆద్యుడు, పూజ్యుడు, అధినేత ఒక్క చంద్ర‌బాబేన‌ని విమ‌ర్శించారు.
అక్ర‌మంగా వంద‌కోట్లు సంపాదించార‌ని, వాటిని ఎక్క‌డ దాచుకోవాలో అర్థంకాక
ఎమ్మెల్యేల‌ను కొంటున్నార‌న్నారు. రాజ‌ధాని రియ‌ల్ఎస్టేట్‌, గోదావ‌రి పుష్క‌రాలు, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల‌లో సంపాదించిన బ్లాక్‌మ‌నీని
వైట్‌మ‌నీగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య
పెట్ట‌డానికే చంద్ర‌బాబు... అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్న‌ట్లు పార్టీ
మారిన ఎమ్మెల్యేల‌తో చెప్పిస్తున్నార‌ని ఆరోపించారు. 

 

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న‌న్న కుటుంబం మొత్తం ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని
గుర్తు చేశార‌ని,
దివంగ‌త మ‌హానేత
ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌నుషులుగా వ‌చ్చార‌ని, వీరిని గెలిపిస్తే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని
ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించారే త‌ప్పా పార్టీ మారిన ఎమ్మెల్యేల మొహాలు చూసి
ఓట్లు వేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల్లో వారిని ఓడించడానికి ప్ర‌య‌త్నించిన
చంద్ర‌బాబు పార్టీలో చేరి ఆయ‌న కాళ్ల‌మీద ప‌డ్డారంటే ఇంత‌క‌న్నా నీచ రాజ‌కీయాలు
ఎక్క‌డైనా ఉంటాయా అని ప్ర‌శ్నించారు. 

 

ఉప ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అభివృద్ధే ఎజెండాగా తీసుకొని ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని
డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక‌ల్లో 8మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావ‌ని విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబుది
శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌ల ప‌రిపాల‌న అంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని, ఆ మాట‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి చెబితే చేత్తో
కాదు... మ‌రో ర‌కంగా ప్ర‌జ‌లు వారికి స‌మాధానం చెబుతారన్నారు. ఫిరాయింపు
ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీని ఎంత ఘాటుగా తిడితే అంత మంచి ఫ్యాకేజీ
అంటూ చంద్ర‌బాబు ఆఫ‌ర్ పెట్టిన‌ట్లు తెలిసింద‌న్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై
అనర్హ‌త వేటు వేయాల‌ని స్పీకర్‌కు కూడా విన‌తిప‌త్రం అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు.
 స్పీక‌ర్ మంచి నిర్ణ‌యం తీసుకుంటార‌ని వైఎస్సార్ సీపీ ఆశిస్తుంద‌న్నారు.

 

బినామీల పేర్లతో సీఎం,
ఆయ‌న కుమారుడు, ఎమ్మెల్యేలు, మంత్రులు వంద‌ల ఎక‌రాల‌ను కొనుగోలు చేశార‌ని, భూ కుంభ‌కోణం ఆధారాల‌తో స‌హా భ‌య‌ట‌ప‌డింద‌న్నారు.
రూ. 6వేల జీతం తీసుకునే వ్య‌క్తి  100ఎక‌రాల భూమి ఎలా కొనుగోలు చేస్తార‌ని చంద్ర‌బాబును
ప్ర‌శ్నించారు. నారాయ‌ణ క‌ళాశాల‌లో స్వీప‌ర్ ద‌గ్గ‌ర నుంచి లెక్చ‌ర‌ర్స్ వ‌ర‌కు
బినామీలుగా త‌యార‌య్యార‌ని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల బినామీ పేర్ల‌తో ఉన్న భూముల‌ను ఆ
బినామీలే తీసుకోవాల‌ని,
ప్ర‌జ‌ల డ‌బ్బుతో
మీరైనా బాగుప‌డండి అని సూచించారు. చంద్ర‌బాబు ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు ప‌న్నినా అలుపు, విరామం ఎరుగ‌ని యోధుడు, మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడు, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అహర్నిశలు
పాటుప‌డే ఏకైక నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని కొనియాడారు. తాము సైతం ఆయ‌న
అడుగుజాడ‌ల్లో న‌డిచి వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రుస్తామ‌న్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top