పచ్చచొక్కాల ముసుగులో అశోక్ బాబు, సాగర్ లు

తిరుపతి రూరల్‌ : చట్టాన్ని, ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీకి ఊడిగం చేస్తూ సామాన్యులను, వైయస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్న కొందరు అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని వైయస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు తప్పనిసరిగా దోషులుగా నిలబడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉద్యోగులపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించి పచ్చచొక్కా ముసుగులో అశోక్‌బాబు, సాగర్‌ చిలకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తన మాటలను తప్పుపడుతున్న వారు తప్పుచేసిన వారిని వదిలివేయాలని కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. తనను విమర్శించే ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులు బాధపెడితే మాకు చెప్పండి అంటూ.. ప్రత్యేకంగా గ్రీవెన్స్‌డేను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

Back to Top