జైల్లోనూ ఎమ్మెల్యే నిరాహార దీక్ష

చిత్తూరుః ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, జైల్లో నిర్బంధించిన వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు.  జైల్లోనూ నిరసన కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం ముట్టకుండా నిరాహారదీక్ష చేస్తున్నారు. పోలీసులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఆహారం తీసుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. చెవిరెడ్డితో పాటు అరెస్టైన మరో 35 మంది నిరసనదీక్ష కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్‌ నెరవేరే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రామాపురంలో ఉన్న చెత్త డంపింగ్‌యార్డును తరలించాలన్న డిమాండ్‌తో నిరాహారదీక్ష చేపట్టిన చెవిరెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను శనివారం పుత్తూరు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచగా 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. దీంతో ఆయనను పోలీసులు చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. చెవిరెడ్డితో పాటు మరో 35 మందికి కోర్టు వచ్చే నెల 7 వరకు రిమాండ్‌ విధించింది.
Back to Top