ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

⇒ ఎన్నికల్లో 1,000 కోట్లు ఇస్తాం అన్నారు.. 5% కూడా ఇవ్వలేదు
⇒ ఆరోగ్య బీమా అమలవడం లేదు
⇒ ప్రతిపక్ష నేతకు విన్నవించుకున్న చేనేత నాయకులు
⇒ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న వైయస్ జగన్

హైదరాబాద్‌: ఏపీలో ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో చేనేత రంగంపై ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శించిందని చేనేత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించి కేటాయింపులు పెంచేలా ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో పలువురు నాయకులు వైయస్ జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని, సమస్యలను వివరించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పిం చారు. చేనేత రంగం సంక్షేమానికి రూ. 1,000 కోట్ల నిధులు కేటాయిస్తామని టీడీపీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, అయితే బడ్జె ట్‌లో 5 శాతం నిధులూ ఇవ్వలేదని వారు వాపోయారు.

గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు ఉన్న ఆరోగ్య బీమా పథకం కూడా ప్రస్తుతం లేదన్నారు. చేనేత కార్మికులకు నూలుపై ఇచ్చే 20 శాతం సబ్సిడీని కూడా ఇవ్వలేదన్నారు. చేనేత సహకార బ్యాంకులు నెలకొల్పాలని, చేనేత మగ్గాలకు 50 యూనిట్ల వరకూ ఉన్న ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని 200 యూనిట్లకు పెంచాలని, బీమా యోజన పరిధిలోకి కార్మికులందరినీ తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలపై ఆస్తి పన్నును కూడా రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత వృత్తిని కొనసాగిస్తూ ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షలైనా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తానన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చినందుకు చేనేత నాయకులు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top