చీకటి రాజ్యంలో కుమ్మక్కు రాజకీయం

ఇబ్రహీంపట్నం, 6 ఫిబ్రవరి 2013:

కుమ్మక్కు రాజకీయం కారణంగానే ఈ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టడం లేదని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ నుంచి ప్రారంభమైన యాత్ర సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం చేరింది. అక్కడ ఏర్పాటైన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. వేలాదిమంది సభకు హాజరయ్యారు. మోకాలి గాయం నుంచి కోలుకున్న షర్మిల బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. జగనన్న నాయకత్వంలో ప్రారంభమైన పాదయాత్ర ఇంతవరకూ కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలు  దాటి రంగారెడ్డి జిల్లాలో సాగుతోందని తెలిపారు. డిసెంబరు నెలలో తన మోకాలికి గాయం కావడం వల్ల శస్త్ర చికిత్స అవసరమై విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందనీ,  మళ్ళీ ఈరోజు మొదలు పెట్టాననీ శ్రీమతి షర్మిల తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం, ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు నెత్తిన మోయడాన్ని నిలదీయడం, మహానేత అమలుచేసిన సంక్షేమ పథకాలను వివరించడం లక్ష్యంగా పాదయాత్రను చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఈ ప్రభుత్వ పాలన చీకటి రాజ్యాన్ని తలపిస్తోందని ధ్వజమెత్తారు.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలు హాయిగా ఉన్నారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. మహానేత రైతులకు 12వేల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. 'ఇప్పుడా పరిస్థితి లేదు. భరోసా లేదు. మద్దతు ధర లేదు. ధరలు నాలుగింతలు పెరిగాయి. అప్పుల ఊబినుంచి బయట పడే మార్గం లేదు. ఇవేవీ ప్రభుత్వానికి పట్టడం లేదం'టూ శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మహిళలకు సొంత అన్నలా వెన్నంటి నిలబడ్డారన్నారు. ఆయన హయాంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని చెప్పారు. వడ్డీ లేకుండా రుణమిస్తామని ఇప్పటి సీయం చెబుతున్నా చాలామందికి అందడం లేదని తెలిపారు. ఈ రాజ్యంలో రెండు పూటలా తినే పరిస్థితి లేదన్నారు.  ఓ తల్లి మనసు ఎంత బాధ పడుతుందో పాలకులకు తెలీడం లేదన్నారు.

ధరలు అమాంతంగా పెరిగాయి

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఉన్నప్పుడు కరెంటు చార్జీలు ఎన్నడూ పెరగలేదని శ్రీమతి షర్మిల చెప్పారు.  చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలు కట్టడానికి ఆడవారు నగలు అమ్మాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 'గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. 108 వాహనం ఫోను చేస్తే పావుగంటలో వచ్చేది. ఇప్పుడు దాని జాడ లేదు. 104 కనిపించనే కనిపించడం లేదు. పింఛను లేదు. ఇందిరమ్మ ఇల్లు లేదు. ఆరోగ్యశ్రీ నాస్తి' అంటూ ప్రస్తుత సమస్యలను ఆమె ఏకరువు పెట్టారు. 'డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏనాడు ధరలు పెంచలేదన్నారు.  ఫీజు రీఇంబర్సుమెంటుతో ఎందరో విద్యార్థులు ఉన్న చదువులు చదువుకున్నారు. ఇప్పుడది లేక ఎందరో విద్యార్థులు చదువుకోలేక ఇంట్లో కూర్చున్నారు' అని ఆవేదన వ్యక్తంచేశారు. 16 లక్షల ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి చెబుతున్నారనీ, ఎవరికిచ్చారో తెలీడం లేదని పేర్కొన్నారు.

కిరణ్ సీఎం అయ్యాక కరెంటు సంక్షోభం

      కిరణ్ సీఎం అయ్యాక భయంకరమైన కరెంటు సంక్షోభం ఏర్పడిందని శ్రీమతి షర్మిల చెప్పారు. పరిశ్రమలు మూతపడి,  లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని తెలిపారు. రైతుల్ని అష్టకష్టాల పాలుచేస్తున్నారన్నారు. ఎనిమిదేళ్ళ కాలంలో చంద్రబాబు ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారనీ, చార్జీలు కట్టని వారి మోటార్లు ఎత్తుకుపోయారనీ ధ్వజమెత్తారు. కరెంటు చార్జీలు కట్టలేక నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలకు  చేసుకున్నారని తెలిపారు. పోలీసు కాల్పుల్లో రైతులు చనిపోతే.. చంద్రబాబు వారిని కాల్చిన పోలీసు కుటుంబాలను పరామర్శించారని ఎద్దేవా చేసినపుడు ప్రజలనుంచి చప్పట్లతో స్పందన వచ్చింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ఆమె సవివరంగా తెలిపారు. చంద్రబాబు హయాంలో భూములను ఆయనకు కావలసిన వారికి ఇచ్చేశారని చెప్పారు.

కుమ్మక్కు రాజకీయాలపై ధ్వజం

     కాంగ్రెస్, టీడీపీలు ఎమ్మెల్సీ ఎన్నికలలో కుమ్మక్కయ్యాయనీ శ్రీమతి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. జగనన్నకు బెయిలు రాకుండా కూడా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. బెయిలు వస్తుందనుకున్న తరుణంలో ఆయన తన ఎంపీలను చిదంబరం దగ్గరకు పంపి, బెయిలు రాకుండా కుట్ర చేశారని చెప్పారు. చంద్రబాబు ప్రస్తుతం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. జగనన్న ఆస్తుల మీద, బంధువుల ఆస్తుల మీద, సాక్షి మీద దాడులు చేయిస్తున్నారు. జగనన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి ఉంటే ఇన్ని నెలలు జైలులో ఎందుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఈ పాటికి కేంద్ర మంత్రో ముఖ్యమంత్రో అయ్యి ఉండేవారన్నారు. ఈ అంశం ఉప ఎన్నికల సమయంలో గులాం నబీ ఆజాద్ ప్రసంగంలోనే వెల్లడైందని గుర్తుచేశారు.
     
స్వార్థ రాజకీయాల వల్లే జగనన్న జైలు పాలు

     చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడం లేదని శ్రీమతి షర్మిల తెలిపారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై  కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.  స్వార్థ రాజకీయాలతో జగనన్నను జైలు పాలుచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి  బయటికొస్తే కాంగ్రెస్ టీడీపీలు మూతపడతాయనీ, అందుకే ఆ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయనీ వివరించారు.   చిరంజీవి కుమార్తె ఇంట్లో 70 కోట్లు దొరికినప్పటికీ ఏ చర్యలూ లేవన్నారు. చనిపోయిన డాక్టర్ రాజశేఖరరెడ్డి పేరును కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చడాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదీ తేటతెల్లమవుతోందని శ్రీమతి షర్మిల చెప్పారు. ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్నారు. ఏదో ఒక రోజు జగనన్న బయటకొస్తారనీ, మీ అందర్నీ కలుస్తారనీ.. రాజన్న రాజ్యం స్థాపిస్తారనీ వివరించారు. తమను ఆదరిస్తున్న ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ఆమె తెలిపారు. సభలో స్థానికులు ఆమెకు కిరీటం బహుకరించారు. ఓ బాలికకు పేరు పెట్టమని తల్లిదండ్రులుకోరినపుడు ఆమెకు విజయ అని నామకరణం చేశారు. శ్రీమతి షర్మిల మూడుసార్లు విజయ అని పలికినపుడు ప్రజలు విజయ.. విజయ.. అంటూ ప్రతిస్పందించారు. సభ ఆద్యంతం శ్రీమతి షర్మిల ప్రసంగానికి ప్రజలు చప్పట్లు కేరింతలతో స్పందించారు.

తాజా వీడియోలు

Back to Top