హోదా ఇస్తామని చెప్పి మోసగిస్తారా..?

()తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు
()ఇప్పుడు హోదాతో ఏం లాభం లేదంటారా..?
()వైయస్ జగన్ నేతృత్వంలో హోదా సాధిస్తాం
()వైయస్సార్సీపీ నేతలు అంజాద్, ఆకేపాటి

వైయస్‌ఆర్‌ జిల్లా: దేశంలో 11 రాష్ట్రాలకు క్యాబినేట్‌ నిర్ణయం ద్వారా హోదాను కల్పించినప్పుడు.... ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం ఎందుకు అభ్యంతరాలు వ్యక్తపరుస్తుందని ఎమ్మెల్యే అంజద్‌బాషా ప్రశ్నించారు. వైయస్సార్ కడప జిల్లాలో చైతన్యపథం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. విభజన సమయంలో టీవీలు ఆఫ్‌ చేసి మరీ బీజేపీ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందన్నారు. బీజేపీ మద్దతుతోనే హౌస్‌లో బిల్లుపాస్‌ అయ్యిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల ఆంధ్రులు పోరాడుతుంటే చట్టంలో లేదని కేంద్రం మాట్లాడుతుందన్నారు. విభజన సభలో ఏపీకి 10 సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడెందుకు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని నిలదీశారు.  చట్టంలోని అంశాలను తీసుకొచ్చి ప్రత్యేక ప్యాకేజీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదా అని నిలదీశారు. 
 
ఉపయోగం లేనప్పుడు హోదానే ఇవ్వొచ్చుగా!
ప్రత్యేక హోదాతో ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నప్పుడు ఉపయోగం లేని హోదానే ఇచ్చేందుకు ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారని పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రభుత్వాలను ప్రశ్నించారు. చైతన్య పథం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... హోదా లాభం లేకపోతే తెలుగు ప్రజలంతా ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదాను పది సంవత్సరాలు ఇస్తామని మోడీ, పదిహేను సంవత్సరాలు కావాలని చంద్రబాబు డిమాండ్‌ చేసి ఈ రోజు హోదాతో ఒరిగేదేమీలేదని చెప్పడం దుర్మార్గమన్నారు. హోదాతో రాష్ట్రం అభివృద్ధి చెందదంటున్న టీడీపీ నేతలు ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ప్యాకేజీ గొప్పదని చెప్పిన ముఖ్యమంత్రి... టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఏపీలో పెట్టుబడులు ఎందుకు పెట్టించడం లేదని విరుచుకుపడ్డారు. ఏపీకి హోదా వస్తే రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడుతుందని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. 

Back to Top