నయవంచకుడిపై చీటింగ్ కేసులు

 • రెండేళ్ల పాలనలో టీడీపీ పూర్తిగా వైఫల్యం
 • అబద్ధాలు, మోసాలతో కాలం వెళ్లదీస్తున్న బాబు
 • ప్రజలను నయవంచన చేసిన బాబుపై చీటింగ్ కేసులు
 • 13వ తేదీన విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం
 • జూలై 8వ తేదీన గడగడపకు వైయస్సార్సీపీ కార్యక్రమంః పార్థసారథి

 • హైదరాబాద్ః టీడీపీ సర్కార్  పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈరెండేళ్లలో చంద్రబాబు  చేసిందేమీ లేకపోగా..ఇంకా ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరెండేళ్లలో పలానా కార్యక్రమం చేశామని చెప్పుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతూ  అనేకసార్లు ఉద్యమాలు చేశామని పార్థసారథి చెప్పారు. ప్రజలను నయవంచన చేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా...రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయనున్నట్లు పార్థసారథి ప్రకటించారు. 

  చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచనే లేకపోవడం బాధాకరమన్నారు. ఎంతసేపు  కళ్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని బాబుపై ధ్వజమెత్తారు.  అధికారంలోకి రావడం కోసం ప్రజలకు అనేక హామీలిచ్చారు. రాతపూర్వకంగా మీరిచ్చిన హామీలు సాధ్యమేనా అని ఈసీ అడిగితే...నాకు అనుభవం ఉంది, తూచా తప్పకుండా అమలు చేస్తానని బాబు చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ చేయడం లేదు. రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏ ఒక్కటీ  అమలు చేయకుండా ఇంకా అబద్ధాలు చెబుతూ  ప్రజలను మోసగించడం దారుణమని పార్థసారథి ఫైరయ్యారు. 

  ఏడాదిలోనే పట్టిసీమ పూర్తి , గోదావరి-కృష్ణా నధుల అనుసంధానం అని మాట్లాడారు. ఒక్కసారి కాలువ దగ్గరకు ప్రజలను, మీడియాను, ప్రతిపక్షాలను తీసుకెళితే అది ఎంతవరకు పూర్తి అయింది. నీళ్లు కృష్ణాలో ఎక్కడ కలిశాయో తెలిసే అవకాశం ఉండేది. చంద్రబాబు అబద్ధాలనే నిజాలుగా కల్పించే ప్రయత్నం చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు.  ప్రకాశం బ్యారేజీ నుంచి 66 టీఎంసీల నీళ్లతో 6 లక్షల ఎకరాలకు మాత్రమే సాగవడానికి అవకాశం ఉంటుంది.  8.5 లక్షల ఎకరాల పంటలు కాపాడామని చెబుతున్నారు. రైతులు పంటలను మీరు నీళ్లు ఇస్తే కాపాడుకున్నారా..? వారు ఆయిల్ ఇంజిన్లు పెట్టుకుని కాపాడుకున్నారో ఒక్కసారి వాళ్లదగ్గరకు వెళితే తెలుస్తుంది. ఇంకా ఎంతకాలం చంద్రబాబు ఈమోసాలు. ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నారు. 

  రాయలసీమలో కృష్ణా మిగులు జలాలు తరలింపు అని ఊదరగొట్టారు.  ఎలా తరలిస్తారు బాబు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్ లు పూర్తి చేయకుండానే ఎలా తరలిస్తారు. వాటిని పూర్తి చేసేందుకు కనీసం నిధులు కూడా ఇవ్వడం లేదు. రాజధానికి భూసేకరణ ఓ రికార్డు అని మాట్లాడుతున్నారు. అక్కడ రైతులు భూములు కోల్పోయి ఎలా విలపిస్తున్నారో ఒక్కసారి అక్కడ పర్యటిస్తే తెలుస్తుంది. ఒక్కస్లాబు, రెండు స్లాబులేసి రాజధాని అయిపోయిందని చెప్పడం ఎంతవరకు సబబు. 

  అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అని మాట్లాడారు. ఎవరికి న్యాయం చేసినా మేం సమర్థిస్తాం. కానీ అబద్ధాలు చేస్తూ మోసం చేయడం మాత్రం నీచం.  కాపులకిచ్చిన రిజర్వేషన్ ప్రస్తావనే లేదు. అడిగితే బీసీలకు, కాపులకు మధ్య బాబు తగాదా పెడుతున్నారు. బలహీన వర్గాలకు మూడు సంవత్సరాల్లో 30 వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులు రావాల్సి ఉండగా... కేవలం 9 వేల కోట్లు కేటాయింపులు చేశారు. రెండేళ్లు మోసం చేశారు. ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. 

  ప్రభుత్వంలో అవినీతి జరగడం లేదని చెప్పే ధైర్యం బాబుకు గానీ , ఆ పార్టీ నాయకులకు గానీ ఉందా...? అవినీతిపై  సీబీఐ ఎంక్వైరీ వేయించే ధైర్యం ఉందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాజధాని, సత్రం  భూములు మింగేస్తున్నారు, నీరు-చెట్టులో వేల కోట్ల దోపీడీ ఇలా అన్నింటిలోనూ అవినీతే. అవినీతిని అడ్డుకుంటే....తెలుగుదేశం పార్టీ వాళ్లు పోలీసులను, అధికారులను కూడా కొడతున్నారు.  పోలీస్ వ్యవస్థ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ...పోలీస్, రాజ్యాంగవ్యవస్థల మీద తమకు నమ్మకముందని పార్థసారథి తెలిపారు. రెండేళ్ల మోసపూరిత పాలన కారణంగా...రేపు చంద్రబాబుపై అన్ని పీఎస్ లలో ఫిర్యాదులు చేస్తామన్నారు. 

  అదేవిధంగా ఈనెల13వ తేదీన విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  రాబోయే రోజుల్లో పార్టీ చేసే కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న మోసాలు, వైఫల్యాల గురించి చర్చిస్తామన్నారు. దీంతో పాటు వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రియతమ నేత  వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా  గడపగడపకు వైయస్సార్సీపీ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశామన్నారు. వైయస్సార్ పరిపాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని పార్థసారథి గుర్తు చేశారు. 

Back to Top