ప్రివిలేజ్ కమిటీలో చిల్లరగాళ్లు

  • హోదా కోసం పోరాడితే దొంగలంటారా..?
  • ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత నిర్వర్తించాం
  • రాష్ట్రభవిష్యత్తు కోసం హోదాపై చర్చకు పట్టుబట్టాం
  • ముందే జడ్జిమెంట్ చేసినప్పుడు తమను పిలవడం దేనికి..?
  • వెన్నుపోటు పొడవడం, చెప్పులు వేయించడం బాబు సంస్కృతి
  • తనను సభలో లేకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
హైదరాబాద్ః ప్రివిలేజ్ కమిటీలో చిల్లరగాళ్లు చేరి సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. కమిటీ అన్నది సభ్యుల హక్కులు కాపాడేందుకు ఉండాలే గానీ కాలరాసేందుకు కాదని చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....రాష్ట్ర భవిష్యత్తుకు  సంబంధించిన ప్రత్యేకహోదా అంశంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో తమ బాధ్యత నిర్వర్తించామని చెప్పారు. హోదా కోసం పోరాడుతున్న వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను బందిపోటు దొంగలు, తప్పు చేసిన మనుషులుగా కమిటీ సభ్యులు చిత్రీకరించడం దుర్మార్గమని మండిపడ్డారు.

తప్పు చేసి వచ్చారంటూ కమిటీ సభ్యులు  రామకృష్ణ, శ్రవణ్ లు మాట్లాడడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలో పెద్ద మనుషులను పెట్టాలే తప్ప ఇలాంటి చిల్లరగాళ్లను కాదని అన్నారు.  ముందే మీరు జడ్జిమెంట్ చేసి తప్పు చేశారన్న నిర్ణయానికి వచ్చినప్పుడు కమిటీ ముందు హాజరు కావాలని తమను ఎందుకు పిలిచారని చెవిరెడ్డి నిలదీశారు. మార్షల్స్ పై దాడి చేశారంటూ క్లిప్పింగ్ లు చూపించారు. అందులో తాను దాడిచేసినట్టుగానీ, గొడవ పడినట్టుగానీ చూపించమంటే చూపించలేకపోయారు. బల్లలెక్కామన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా అందరూ పోరాటం చేయాల్సిన దానిపై ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత నిర్వర్తించాం. మైకులో హోదా అవసరాన్ని చెప్పడానికి ప్రయత్నించాం. మైక్ ఇవ్వలేదు.  స్పీకర్ కు నేరుగా చెబుదామంటే మార్షల్స్ అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ కు కనబడనందునే బల్లలు ఎక్కి హోదా  అవసరాన్ని చెప్పాం తప్ప సభా నియమాలను అగౌరవపర్చడం గానీ, అవమానపర్చడం గానీ తాము చేయలేదని చెవిరెడ్డి అన్నారు. 

ముఖ్యమంత్రిది, తనది ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం అయినందునే తనపై కక్షసాధిస్తున్నారని చెవిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 2001లో తాను కాంగ్రెస్ తరపున జడ్పీటీసీగా గెలిచినప్పుడు కూడా చంద్రబాబు 20 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టాడని, కానీ తాను లొంగలేదన్నారు.  అప్పటి నుంచి చంద్రబాబు తనపై పగ పెంచుకున్నట్లుందని చెప్పారు. కమిటీ సభ్యుల తీరు చూసినప్పుడు తనను కచ్చితంగా సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపించిందన్నారు. నీది, ముఖ్యమంత్రిది సొంత నియోజకవర్గం శాలరీలు ఇవ్వకుండా కట్ చేస్తారు..? సస్పెండ్ చేస్తాడు..? సభలోకి రానివ్వడు అని టీడీపీ వాళ్లే చెబుతున్నారని అన్నారు. వ్యక్తిగత ద్వేషాలతో శిక్షించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కమిటీ ముందు హాజరుకావాలని తమకు నోటీసులివ్వడం దేనికని ప్రశ్నించారు. 

సభలో టపాసులు వేయలేదు. అసెంబ్లీలో ఎవరినీ ఏడిపించలేదు. పార్టీ పెట్టిన వ్యక్తి నుంచి లాక్కొని ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఎవరిమీద చెప్పులు వేయించలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు.  అసెంబ్లీలో గొడవలు చేయడం,  స్పీకర్ ను ఏడిపించడం, గవర్నర్ కుర్చీ లాగడం టీడీపీ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. టీడీపీ మంత్రులు, సభ్యులు తమను  పాతేస్తా, నరహంతకులు, ఉగ్రవాదులంటూ  దూషించినప్పుడు, వారిని పిలిపించి మాట్లాడాలని 11 సార్లు ప్రివిలేజ్ కమిటీకి నోటీసులిచ్చామన్నారు. కానీ ఇంతవరకు వాళ్లను పిలిచిందే లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేకహోదా కోసం  నిరసన తెలిపిన 11మందిని బందిపోటు దొంగలతో పోల్చుతారా..?. కమిటీలో మీరు అలా నిర్దారణ చేస్తున్నప్పుడు ఇక దానికేం విలువ ఉంటుందని చెవిరెడ్డి ప్రశ్నించారు.  మా వర్షన్ వినకుండానే తప్పు చేశారని ప్రకటించడం దుర్మార్గమన్నారు. మేం చెబితే వినేవాళ్లు ఎవరు లేకపోవడంతో నిరసనగా కమిటీ నుంచి వాకౌట్ చేసినట్లు చెవిరెడ్డి తెలిపారు.  


తాజా వీడియోలు

Back to Top