ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన..!

ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపుమేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. 

గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ...బస్టాండ్‌లో డీఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.

బస్సు చార్జీల పెంపుపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. చార్జీల పెంపుతో బస్సు ప్రయాణం ఎంత భారమవుతోందో ప్రయాణికులకు వివరించారు. అనంతరం డీఎం బీవీఎస్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. 

బొబ్బిలిలో వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రౌతు రామమూర్తి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ధర్నా, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చీపురుపల్లిలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు గల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేశారు.

Back to Top