అసెంబ్లీలో చంద్రబలి సినిమా

వెలగపూడి: బాహుబలిని మించిన చంద్రబలి సినిమాను అసెంబ్లీలో చూపించడానికి అధికార పార్టీ సన్నాహాలు చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. సినిమా దర్శకులు మామూలుగా అయితే రెండున్నర గంటల్లో సినిమా మొత్తం చూపిస్తారని, కానీ చంద్రబాబు మాత్రం మూడు సంవత్సరాలుగా ప్రజలకు రాజధాని గ్రాఫిక్స్‌ సినిమాను చూపిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతీరోజు అసెంబ్లీలో సినిమాలే సినిమాలు చూపిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజధానికి ఒక్క ఇటుక కూడా వేయని చంద్రబాబు తాత్కాలికం పేరుతో ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీలో రాజదాని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ అంటూ మళ్లీ కొత్త సినిమాకు పిలుస్తున్నారని చెప్పారు. ఏపీ శాశ్వత రాజధాని ఎక్కడ కట్టబోతున్నారో తెలియదు.. ఎప్పుడు కడతారో తెలియదు కానీ ప్రచారం మాత్రం బ్రహ్మాండగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసలు రాజధాని నిర్మాణం వెనుక ఉన్న చిదంబర రహస్యమేంటని ప్రశ్నించారు. సింగపూర్, జపాన్‌ డిజైన్లు రెడీ అయ్యాయంటారు.. కానీ ఇప్పటి వరకు అవి అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. జీవితాంతం ప్రజలకు సినిమాలు చూపించి మభ్యపెట్టొద్దని, ఒక్కదాన్ని మూడుసార్లు శంకుస్థాపనలు చేసి రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయోద్దని కోరారు. రాజధాని పేరుతో రియలెస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి చంద్రబాబు బరితెగించడం దుర్మార్గమన్నారు. 
––––––––––
డైరెక్టర్ల పేర్లు చెప్పడం మాని రాజధాని పూర్తి చేయాలి
వెలగపూడి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు ఒక్క ఇటుక ముక్క అయినా పేర్చారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణాల డిజైన్లకు ఒకసారి బోయపాటి శ్రీను అంటారు.. మరోసారి రాజమౌళి అంటారు.. ఇంకోసారి కొత్తగా క్రిష్‌ అంటున్నారు. ఏంటిది చంద్రబాబు అని ప్రశ్నించారు. మళ్లీ రేపు పొద్దున ఏ సినిమా అయినా హిట్‌ అయితే ఆ డైరెక్టర్‌ పేరు చెబుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రాజధానిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ అంటూ మరో కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇది ఎన్నో పవర్‌పాయింట్‌ ప్రజంటేషనో చెప్పగలరా అంటూ బాబును నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్టర్లు, డిజైన్లు పక్కబెట్టి ముందు రాజధాని నిర్మాణం చేపట్టాలని సూచించారు. 
–––––––––––
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లిస్తున్న ప్రభుత్వం
వెలగపూడి: సోషల్‌ వెల్ఫేర్‌ కోసం కేటాయించే నిధులను చంద్రబాబు సర్కార్‌ పక్కదారి మళ్లిస్తోందని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల బడ్జెట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ కోసం కేవలం రూ. 3,224 కోట్లు మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. వాటిలో రూ. 2,531 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేయగా.. ఖర్చు చేసింది మాత్రం రూ. 2,244 కోట్లేనని స్పష్టం చేశారు. అరకొర నిధులు కేటాయిస్తూ వాటిలో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు పేదలకు ఒక్క ఇళ్లు అయినా నిర్మించారా అని చంద్రబాబును ప్రశ్నించారు. నిధులన్నీ ఏమైపోయాయని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్‌ అని చెప్పి వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. కరెంట్‌ మీటర్ల పేర్లు చెప్పి వేల రూపాయలను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు కేటాయించిన నిధులు వారి అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఇతర పనులకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాత్రం అన్ని అభివృద్ధి పథకాలు చేపడుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం అంకెల గారెడీతో ప్రజలకు మభ్యపెట్టకుండా ప్రాక్టికల్‌గా పనులు చేయాలని డిమాండ్‌ చేశారు. 
–––––––––––––
చంద్రబాబుకు ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ముందా
వెలగపూడి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించనందుకు నిరసనగా మీ ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ధైర్యంగా చెప్పారని గుర్తు చేశారు. ఆ విధంగా మీరు ఎంపీలతో రాజీనామా చేయించగలరా అని చంద్రబాబును నిలదీశారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం కేంద్రం నుంచి సాధించుకున్న నిధులెన్ని అని ప్రశ్నిస్తే అధికార పార్టీ సభ్యుల నుంచి సమాధానం రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిత్రపక్షమైన బీజేపీ నుంచి నిధులు సాధించడంలో చంద్రబాబు ఎందుకు వెనకబడ్డారని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి మునుపే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు కేవలం రూ. 2,916 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేశారు. పోలవరం పేరు చెప్పి కాలం వెల్లదీస్తున్నారు కానీ పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.16 వేల కోట్లు ఉన్న పోలవరాన్ని రూ. 40 వేల కోట్లకు అంచెనాలను పెంచడంతో మోడీ చంద్రబాబును నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు నిధులు తేవడంలో విఫలమయ్యారన్నారు. శాసనసభలో మంత్రులు ప్రజా సమస్యలను చర్చించడం మానేసి కేవలం సినిమా డైలాగులతో కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షానికి సమయం ఇస్తే సమాధానం చెప్పలేమనే భయంతో పవర్‌ప్లాంట్‌ ప్రజంటేషన్‌ అని కొత్తనాటకం ఆడుతున్నారని ఆరోపించారు.  
Back to Top