చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. కోట‌రీ పెత్త‌నం

చంద్ర‌బాబు నాయుడు పాల‌న అంటే అధికారుల పాల‌న‌గా చెబుతారు. గ‌తంలో ప‌రిపాల‌న చేసిన‌ప్పుడు కూడా ఆయ‌న కొంత‌మంది ఐఎఎస్ అధికారుల‌కు బాగా ప్రాధాన్యం ఇచ్చేవారు. వారంతా ఒక కోట‌రీగా ఏర్ప‌డి, ప‌రిపాల‌న‌ను న‌డిపించేవార‌ని చెబుతారు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా కొంద‌రు ఐఎఎస్ అధికారులు ఒక కోట‌రీగా ఏర్ప‌డి చంద్ర‌బాబుతో సాన్నిహిత్యం జ‌రుపుతున్న‌ట్లు స‌చివాల‌యంలో చెప్పుకొంటున్నారు. ఈ కోట‌రీ ముఖ్యంగా బ‌ద‌లీల విష‌యంలో ప్ర‌భావం చూపుతోంది. జిల్లాల్లో పాల‌న‌కు ప‌ట్టుకొమ్మ‌లు అయిన క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఎస్పీల బ‌ద‌లీల్ని ఈ కోట‌రీ శాసిస్తోంద‌ని ప్ర‌చారం ఉంది. దీంతో ఈ కోట‌రీ ఆశీస్సుల‌తోనే ఆయా పోస్టింగ్‌లు, ముఖ్యంగా జిల్లా ప‌రిష‌త్‌ల సీఈవోలు, మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ల క‌మిష‌న‌ర్ పోస్టింగులు ఇస్తున్నార‌ని చెబుతున్నారు. 

ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల్లో ప‌నుల్ని శాసించే ఈ సీఈవోలు, కమిష‌న‌ర్ లు కోట‌రీ అండ‌దండ‌లు చూసుకొని చెల‌రేగిపోతున్నారు. దీంతో అక్క‌డి స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. దాదాపు ఏడాది పూర్త‌యినా చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి. అధికారుల‌కు కోట‌రీ ఆశీస్సులు ఉండ‌టంతో ఇక్క‌డి జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్‌లు కానీ, మేయ‌ర్ లు కానీ ప్ర‌జాహిత కార్యక్ర‌మాల మీద ఎంత మొత్తుకొంటున్నా ప‌ట్టించుకోవ‌టం లేదు. చాలా చోట్ల నిబంధ‌న‌ల బూచి చూపించి అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చాలా చోట్ల కొత్త‌గా ప్ర‌జాప్ర‌తినిధులు అధికారంలోకి రావ‌టంతో ప‌నిచేసేందుకు ఉత్సాహం చూపించినా అధికారులు సాగ‌నీయ‌టం లేద‌నే మాట ఉంది. దిగువ సిబ్బంది కూడా ఈ క‌మిష‌న‌ర్‌లు, సీఈవోల అండ చూసుకొని పాల‌క మండ‌ళ్ల మాట వినటం లేదు. ప‌చ్చ చొక్కా నేత‌ల‌కు ఇచ్చే విలువ నిఖార్సుగా ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ద‌క్క‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది.

ఉద్యోగులతో స‌మ‌ర్థంగా ప‌నిచేయించేందుకు గ‌తంలో బ‌ద‌లీల విష‌యంలో పాల‌క మండ‌ళ్ల‌కు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తాజాగా ఇచ్చిన ఉత్త‌ర్వుల‌తో జిల్లా స్థాయి క‌మిటీలు రంగంలోకి వ‌చ్చాయి. బ‌ద‌లీల డేటాను జిల్లా ప‌రిష‌త్ సీఈవో త‌యారుచేస్తే దాన్ని ఈ క‌మిటీ ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకొంటుంది. ఉద్యోగులు అంతా ఇప్పుడు ఉన్న‌తాధికారుల చుట్టూ తిరుగుతున్నారు త‌ప్పితే స్థానిక సంస్థ‌ల పాల‌క‌మండ‌ళ్ల‌ను ప‌ట్టించుకోవ‌టం లేదు. దీంతో పాల‌న మీద ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఏమాత్రం ప‌ట్టు చిక్క‌టం లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధుల్ని ఉత్స‌వ విగ్ర‌హాలుగా మిగులుస్తున్నారు.
Back to Top