మంత్రిమండలి కాదు కంత్రిమండలి

  • తెలంగాణలో నీతులు మాట్లాడిన ప్రబుద్ధుడు ఇక్కడేం చేశాడు
  • గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు
  • గంగాధర్‌ అక్రమాస్తులపై నిస్పక్షపాత విచారణ జరగాలి
  • సేవ్‌ డెమోక్రసీని విజయవంతం చేద్దాం
  • ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సంజీవయ్య 
నెల్లూరు: చంద్రబాబు నూతనంగా ప్రమాణస్వీకారం చేయించిన మంత్రి మండలిని కంత్రీమండలి అనడం సబబుగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బీఫాం ఇచ్చి గెలిపించిన పార్టీని వదిలేసి మరొక పార్టీలో చేరిన ఫిరాయింపు శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి కాకాణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా  కాకాణి మాట్లాడుతూ... తెలంగాణలో తన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని మాట్లాడిన ప్రబుద్ధుడు.. ఇప్పుడెందుకు వారికి మంత్రి పదవులు కేటాయించారని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు చేస్తే తప్పుకాదు వేరొకరు చేస్తే తప్పా అని నిలదీశారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రులే వాటికి తిలోదకాలు ఇస్తున్నారన్నారు. ఆర్టికల్‌ 10వ షెడ్యూల్‌ 191 సబ్‌క్లాస్‌ 2లో ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరొక పార్టీలో చేరితే అనర్హుడిగా వేటు వేయాలని చట్టాలున్నాయన్నారు. ఆ అధికారం స్పీకర్‌కు ఉందన్నారు. కానీ ఆయనే వాటిని తుంగలో తొక్కి అరాచకాలు, అక్రమాలకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలన్నారు. 

గంగాధర్‌ వెనుకున్నవారెవరో చెప్పాలి
ఇంజనీరింగ్‌ చీఫ్‌ గంగాధర్‌ అక్రమ ఆస్తులపై ప్రభుత్వం నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కాకాణి కోరారు. అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో గంగాధర్‌కు వందల కోట్ల అక్రమ ఆస్తులు నెల్లూరు కేంద్రంగా ఉన్నట్లు బయటపడ్డాయన్నారు. ఆ మూలాలన్నీ ఎక్కడివో గుర్తించాలన్నారు. ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు ఎంత మంది ఉన్నారో వారందరినీ బయటకు లాగాలన్నారు. జిల్లాకు చెందిన కొంత మంది నేతలు ఇంజనీర్‌ గంగాధర్‌తో, ఆయన కుటుంబ సభ్యులతో వ్యాపారాలు చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలు, సమాచారాన్ని ఏసీబీ అడిషనల్‌ జనరల్‌ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. ఆ వ్యక్తులు ఎవరూ, బినామీ ఆస్తులు ఎక్కడున్నాయి.. ఎవరి పాత్ర ఎంత మేరకు ఉందనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుల వివరాలు బహిర్గతం చేయాలని కోరారు.
 
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే వైయస్‌ జగన్‌ ఢిల్లీకి
సేవ్‌ డెమోక్రసీ పేరుతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు కాకాణి, సంజీవయ్యలు కోరారు. రేపు (ఏప్రిల్‌–7వ తేది) రాష్ట్రవ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, వామపక్షాల నేతలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సేవ్‌ డెమోక్రసీలో భాగంగానే పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కలిశారన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి, గవర్నర్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఫిరాయింపు దారులపై ఇచ్చిన ఫిర్యాదులను పక్కనబెట్టి వారిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో ఆ ముగ్గురు కలిసి సాధిస్తున్న అరాచకాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రతీ ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top