అన్నదాతలపై చంద్రబాబు వివక్ష

వైయస్‌ఆర్‌ సీపీ నేతలకు మొరపెట్టుకున్న రైతులు
గామాలపాడు(దాచేపల్లి): చంద్రబాబు ప్రభుత్వం రైతాంగం పట్ల వివక్ష చూపిస్తుందని అన్నదాతలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలకు మొరపెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, నరసరావుపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డిలకు రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన పంటలకు సక్రమంగా సాగునీరు విడుదల చేయకపోవటం వలన దిగుబడులు బాగా తగ్గిపోయాయని, సాగునీరు లేకపోవటం వలన అసలు వరిపంటను సాగు చేయలేకపోతున్నామని రైతులు వారికి చెప్పారు. నాగార్జున సాగర్‌ కుడికాలువ ద్వారా పంటలకు రెండవసారి సాగునీరు విడుదల చేస్తామని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పలుమార్లు చెప్పినప్పటికి నేటి వరకు సాగునీరు విడుదల చేయలేని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు అందకపోవటం వలన మిరప పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని వాపోయారు. దిగుబడి అయిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకుండా పోయిందని, దిగుబడి అయిన పంటను అమ్ముకుంటే పంటల కోసం చేసిన అప్పులు కూడా తీరటంలేదని రైతులు వివరించారు. ఇప్పటికైయిన ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు నేతలను కోరారు. పార్లమెంట్‌ సమన్వయకర్త అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ సాగు, తాగునీరు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామి ఇచ్చారు. రైతుల పట్ల ప్రభుత్వంకు ప్రేమలేదని, సాగునీరు విడుదల కోసం రైతులతో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కృష్ణమూర్తి, మహేష్‌రెడ్డి చెప్పారు.రైతులకు అన్ని విధాలుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుందని వారికి చెప్పారు. 

Back to Top