చంద్రబాబు మాయమాటలు నమ్మొద్దు!

సూర్యాపేట

11 నవంబర్ 2012 : తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు ప్రజల గురించి పట్టించుకోని చంద్రబాబు మాయమాటలు నమ్మవద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ఆనాడు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు పెట్టి మరీ బకాలుకు కట్టని రైతులను జైళ్లకు పంపిన బాబు ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఏ రంగంలోనైనా వైయస్ కన్నా మిన్నగా ప్రజలకు మంచి పరిపాలన అందించానని చంద్రబాబు చెప్పగలరా? అని ఆమె ప్రశ్నించారు. టిడిపి సీనియర్ నాయకులు సంకినేని వెంకటేశ్వర రావు వైయస్ఆర్ సీపీలో చేరిన సందర్భంగా సూర్యాపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన ఒక భారీ బహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు. సంకినేని తదితరులకు పార్టీ కండువా కప్పి ఆమె సాదరంగా వైయస్ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. సభకు పెద్దయెత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు."రాజశేఖర్ రెడ్డిగారు కానీ జగన్ బాబు కానీ తెలంగాణకు వ్యతిరేకం కాదు" అని ఆమె సుస్పష్టంగా ప్రకటించారు.
వైయస్ మరణం తర్వాత చనిపోయిన అభిమానులకు, తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారికీ ఆమె నివాళులర్పించారు.ప్రస్తుతం తెలంగాణలో 'మీ కోసం వస్తున్నా'నంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును నిలదీస్తూ ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు వాజ్‌పేయి ప్రభుత్వంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానంటున్న చంద్రబాబు అప్పుడు ఈ పని ఎందుకు చేయలేదని ఆమె నిలదీశారు. నిజానికి రుణమాఫీ చేయవలసింది కేంద్ర ప్రభుత్వమనీ, ఆనాడు రాజశేఖర్ రెడ్డిగారు కూడా కేంద్రంతో మాట్లాడి రుణమాఫీ చేయించారనీ ఆమె గుర్తు చేశారు. అది అలావుంచి తన చేతిలో ఉన్న విద్యుత్తు బకాయిలను చంద్రబాబు ఎందుకు రద్దు చేయలేకపోయారని ఆమె ప్రశ్నించారు. వైయస్ అధికారంలోకి వచ్చాక రూ.1259 కోట్ల విద్యుత్తు బకాయిలను రద్దు చేశారని ఆమె చెప్పారు. అలాగే తన పరిధిలోనే ఉన్న ఉచిత విద్యుత్తును చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయాలని ఆమె అన్నారు. వ్యవసాయం దండగ అన్నదీ, ఉచితవిద్యుత్తును ఎగతాళి చేసిందీ చంద్రబాబేనని ఆమె విమర్శించారు.
తెలంగాణ ప్రజలు మరచిపోరు!
చంద్రబాబు హయాంలో కరువు వచ్చి, నీళ్లు లేక, తినడానికి తిండి లేక జనం బొంబాయి, దుబాయి వంటి ప్రాంతాలకు వలసలు పోయారని ఆమె గుర్తు చేశారు.అంతేకాదు, బకాయిలు చెల్లించని రైతులను జైళ్లలో పెట్టిందీ ఆయనేనన్నారు. ఇదే విదేశాల్లోనైతే విద్యుత్తు చౌర్యం చేస్తే ఉరి తీస్తారనీ, తాను కాబట్టి జైళ్లకు పంపుతున్నానన్నదీ చంద్రబాబేనన్నారు. అవన్నీ మరచిపోయినట్లు ఇప్పుడు చంద్రబాబు రైతులపక్షాన మాట్లాడుతున్నారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. నాడు పడ్డ ఈ కష్టాలను తెలంగాణ ప్రజలు మరచిపోరనే తాననుకుంటున్నానని విజయమ్మ వ్యాఖ్యానించారు. బెల్టు షాపులను రద్దు చేస్తానంటున్న బాబే ఇప్పుడున్న బెల్టు షాపులకు ఆద్యుడన్నారు. రెండు రూపాయల కిలోబియ్యాన్ని రూ.5.50 చేసింది బాబేననీ, మద్యనిషేధాన్ని ఎత్తివేసిందీ ఆయనేననీ విజయమ్మ గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను గురించి ఏ విధంగానూ పట్టించుకోని చంద్రబాబు "మాయమాటల"నును నమ్మొద్దని ఆమె అన్నారు.
బషీర్‌బాగ్‌ కాల్పుల కేసులో ఇప్పుడు చార్జిషీట్లా!

ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి పేదలు మలమల మాడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డిగారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. ఆర్టీసీ చార్జీలను మూడుసార్లు పెంచి జనం ప్రయాణం చేయలేని స్థితికి నెట్టారని ఆమె విమర్శించారు. రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం సర్ చార్జీల పేరుతో వేలకోట్లు వసూలు చేస్తోందన్నారు. విద్యుత్తు సంక్షోభంతో పరిశ్రమలు మూతబడి వేలాదిమంది ఉపాధి కోల్పోతున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం వస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఆనాడు చంద్రబాబు హయాంలో విద్యుత్తు చార్జీలపై ఉద్యమం జరిగి బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిగితే కాల్పులు జరిపిన పోలీసులను చంద్రబాబు పరామర్శించగా, ఇప్పటి ప్రభుత్వం కేసులు తిరగదోడి వామపక్షాల నాయకులపై చార్జ్‌షీటు పెడుతోందని ఆమె దుయ్యబట్టారు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
రాజశేఖర్ రెడ్డిగారు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకున్నారనీ, ఇన్ని సంక్షేమ పథకాలు శాచ్యురేషన్ ప్రాతిపదికన అమలు చేసి కూడా దేని మీదా ఒక్క రూపాయి కూడా పన్ను వేయలేదనీ ఆమె అన్నారు. నాడు విద్యుత్తు బకాయిల రద్దు, రుణాల మాఫీ, జలయజ్ఞం వంటివాటి ద్వారా తెలంగాణ ప్రజలకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని విజయమ్మ గుర్తు చేశారు. వైయస్ తర్వాత ఆనాడు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా తయారయ్యాయని ఆమె నిరసించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు వైయస్ అన్ని అనుమతులూ సాధించినా ఎందుకు ఈ ప్రభుత్వం దానిని చేపట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాల్సిన ప్రతిపక్షం అధికారపక్షమైన కాంగ్రెస్‌తో కుమ్మక్కైందన్నారు. జగన్ బాబును బెయిలు కూడా రానివ్వకుండా జైలు పాలు చేసి కుట్రలకు పాల్పడ్డారని ఆమె విమర్శించారు. అయితే దేవుడి దయ వల్ల జగన్ బాబు త్వరలోనే బయటకు వస్తాడనీ, రాజశేఖర్ రెడ్డిగారి ప్రతి కలనూ నెరవేరుస్తాడనీ ఆమె భరోసా ఇచ్చారు. వైయస్ సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామని విజయమ్మ ప్రజల హర్షధ్వానాల మధ్య పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల కష్టాలలో పాలుపంచుకోవాలని ఆమె కోరారు.

Back to Top