బీజేపీ ని తొక్కేయటమే బాబు లక్ష్యమా..!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తో కలిసి తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రెండు పార్టీ లు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితోనే ఎన్నికల గోదాంలోకి దిగాయి. కానీ, ఎన్నికల తర్వాత కాలం నుంచి చంద్రబాబు వైఖరి మాత్రం బీజేపీని తొక్కేసేందుకు అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నారు.

గతంలో బీజేపీ నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం పాలన జరిగినప్పుడు తెలుగుదేశం బయట నుంచి మద్దతు ఇచ్చింది. అప్పట్లో కేంద్రం నుంచి లబ్దిపొందుతూనే అదంతా తమ ఘనత మాదిరిగా ప్రచారం చేసుకొన్నారు. బీజేపీ ని రాష్ట్రంలో క్యాడర్ లేకుండా నాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అదే భయంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తో పొత్తుకు కొందరు నాయకులు వెనుకాడారు.

ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ధోరణి కనబరుస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల విషయానికి ఎక్కడా ప్రచారం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజధాని నిర్మాణానికి దాదాపు 18 వందల కోట్ల రూపాయిలు కేంద్రం విడుదల చేసినా ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పెట్రో, ట్రైబల్, సెంట్రల్ యూనివర్శిటీల ఏర్పాటుకి కేంద్రం అనుమతులు ఇచ్చింది అయినా వాటికి భూములు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు కొనసాగిస్తోంది. కేంద్రానికి ఎక్కడ పేరు వచ్చేస్తుంది అన్న  ఉద్దేశ్యంతో హైడ్రామా కొనసాగిస్తోంది. ఉన్నత విద్య కోసం రూ. 4 వేల కోట్లు కేంద్రం  ఇచ్చింది. మరో 4 వేల కోట్ల విడుదలకు రంగం సిద్దంమైంది. అయినా సరే,  నిధుల్ని ఎక్కడ వెచ్చించింది లెక్కలు చెప్పకుండా దొంగాట ఆడుతోంది. ఒంగోలు, చిత్తూరు, తిరుపతి లలో నిమ్స్ ఏర్పాటుకి కేంద్రం అనుకూలంగా ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టడం లేదు.

చంద్రబాబు వైఖరి మిత్రపక్షం బీజేపీలో అసంత్రప్తి కలిగిస్తోంది. ఒక వైపు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని దిగమింగుతూనే , మరో వైపు బీజేపీకి ఏమాత్రం మంచి పేరు రాకుండా అడ్డు పడుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని దాచిపెట్టేసి, నింద అంతా కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. బహిరంగంగా వ్యాఖ్యానిస్తే లేనిపోని సమస్యలు మొదలవుతాయని భావిస్తున్నారు. 
Back to Top