బాబు...అసమర్థ ముఖ్యమంత్రి

హోదాపై పోరాడలేని దద్దమ్మలు
బాబు, వెంకయ్యలు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
కేంద్రంనుంచి మంత్రులను ఉపసంహరించుకోవాలి
చేతగాకపోతే బాబు తప్పుకోవాలి
హోదా కోసం పోరాటానికి వైఎస్ జగన్ సిద్ధంః జోగిరమేష్ 

విజయవాడ  : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. బయటకొచ్చి బాబు హోదాపై ఏం చేస్తారో చెప్పాలన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి హెచ్‌బీ చౌదరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని చెప్పడం తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.  ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలని,  కేంద్ర మంత్రివర్గం నుంచి  మంత్రులను ఉపసంహరించుకోవాలని కోరారు.

22 సార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా ఉందంటూ మీడియా ద్వారా లీకులిస్తూ చంద్రబాబు ప్రజలను మాయ చేస్తున్నారని జోగిరమేష్ మండిపడ్డారు.  హెచ్‌బీ చౌదరి ప్రకటనతో సీఎం చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారన్నారు. సీఎం, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, ఎంపీలు ప్రత్యేక హోదా కావాలని అడగలేని దద్దమ్మలని మండిపడ్డారు.  ప్రత్యేక హోదాపై పోరాడలేని దద్దమ్మను అని సీఎం ఒప్పుకుంటే.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగం చేసైనా ప్రత్యేక హోదా సాధించటానికి తాము సిద్ధమేనని జోగి రమేష్ చెప్పారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ప్రత్యేక హోదా ఆంధ్రుల  హక్కు అని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలుగు ప్రజల వాడీవేడిని కేంద్రానికి చూపిస్తామన్నారు. ఆనాడు హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని మాట్లాడిన వెంకయ్యనాయుడు నోరు మెదపకపోవటం విచారకరమన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు ఐదుకోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు.  అమరావతి నిర్మిస్తున్నామంటూ నగరంలోనే మకాం వేసిన సీఎం రాజకీయ వ్యభిచారం చేస్తూ రోజుకో ఎమ్మెల్యేను కొంటూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం అంటే ప్రజలు అని, ఎంతమంది ఎమ్మెల్యేలను కొన్నా ప్రజల మనస్సుగెలవలేరని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 

ఓటుకు కోట్లు కేసులో  అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పదేళ్లపాటు హైదరాబాద్‌పై హక్కు ఉన్నప్పటికీ.... కేసీఆర్‌కు భయపడి ఆరునెలలకే విజయవాడకు పారిపోయి  మకాం మార్చారన్నారు. హోదా తీసుకురావడంలో బాబు ఘోరంగా విఫలమయ్యాడని మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు.  సింగపూర్, జపాన్, చైనాల చుట్టూ తిరుగుతూ వాళ్ల కాళ్లు పట్టుకోనవసరం లేదని... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే  పారిశ్రామిక వేత్తలంతా పెట్టుబడులు పెట్టేందుకు రెక్కలు గట్టుకొని వస్తారని జోగిరమేష్ చెప్పారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేశారని, రాష్ట్రంలోని యువతను జాగృతం చేశారని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు.
Back to Top