సెక్స్ రాకెట్ కీచకులకు బాబు అండదండలు

నత్తనడకన సెక్స్ రాకెట్ కేసు
దోషులను కాపాడుతున్న చంద్రబాబు
రౌడీ షీట్ నమోదై మూడు వారాలు
కీలక నిందితులను పట్టుకోని పోలీసులు
సెల్ ఫోన్ డేటాలో వాస్తవాలు

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు రౌడీ షీట్ నమోదు చేశారు. ఐతే,  కేసు నమోదై మూడు వారాలవుతున్నా ఇంకా నలుగురు నిందితుల్ని పట్టుకోలేదు.   విద్యుత్ శాఖ డీఏ సత్యానందం మరో ఇద్దరు నిందితులైన పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్‌ల ఆచూకీ ఇంకా లభించలేదు. నిందితుల పరారీ వెనుక అధికార పార్టీ నేతల హస్తముండడంతో కేసును నీరుగారుస్తున్నారు. ఇప్పటికే ఈకేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దావెంకన్నను తప్పించేందుకు కుట్ర చేసిన చంద్రబాబు మిగిలిన వారిని కూడా కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పచ్చనేతలు సాగించిన సెక్స్ రాకెట్ అరాచకాలను వేరే పార్టీలపైకి నెట్టేందుకు చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశాడు. 

విజయవాడలో కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ ముఠాలో పట్టుబడిన ముగ్గురు నిందితుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక అనుమతితో ఈ ముఠాను విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించారు. కాల్‌మనీ ముఠా సభ్యుల సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్‌మనీ- సెక్స్ రాకెట్‌లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో అధిక శాతం మహిళల నెంబర్లే దర్శనమిస్తున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలతో ఈ ముఠా సభ్యులు సంభాషించారన్న ఆధారాలు లభ్యమవుతున్నాయి. అప్పులు ఇవ్వడం, మహిళల అసహాయతను ఆసరాగా తీసుకుని వారిని తమ లైంగిక వాంఛల కోసం దూర ప్రాంతాలకు తీసుకువెళ్లడం వీరు పరిపాటిగా చేసుకున్నట్లు కాల్ డెటా సమాచారం ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. 

కాల్‌మనీ ముఠా నుంచి లభించిన డాక్యుమెంట్ల ద్వారా సుమారు 200 కోట్ల రూపాయల మేరకు కాల్‌మనీ పేరుతో అప్పులు ఇచ్చినట్లు వెల్లడైంది. అనధికారికంగా 500 కోట్లకు పైగా కాల్‌మనీ పేరుతో డబ్బును చెలామణి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యలమంచిలి రాము, దూడల రాజేష్, భవానీశంకర్‌ల ద్వారా కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాల్‌మనీకి సంబంధించి ఆర్థిక వనరులు ఎలా వచ్చాయనే దానిపై నిందితుల నుంచి సరైన సమాదానం రాబట్టలేకపోయారు. అలాగే కాల్‌మనీలోని మిగిలిన నిందితుల ఆర్థిక మూలాలపై కూడా విచారణ జరిపిస్తామని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రకటించినా, దానిపై ఇప్పటివరకు చర్యలేవీ మొదలు కాలేదు.
 
ఇక ఈ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్ శాఖ డిఇ సత్యానందం పోలీసుల నుంచి తప్పించుకోవడం వెనుక కొందరు టీడీపీ పెద్దల సహకారం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యానందాన్ని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించిన కొద్దిసేపట్లోనే ఆయన విజయవాడ నుంచి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు నగరానికి చెందిన ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్, మరో ఎన్జీఓ నేత కూడా సహకరించనట్లు సమాచారం. వీరి వాహనాల్లోనే సత్యానందం రాష్ట్రం విడిచిపెట్టి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యానందాన్ని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు అమెరికాలోని తెలుగు సంఘాల్లో కీలకమైన ఓ ఎన్‌ఆర్‌ఐ అధికార పార్టీలోని ప్రముఖులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కాల్‌మనీ బాధితుల్లో ఓ యువతికి అమెరికాలో ఉపాధి కల్పిస్తానని మోసగించిన ఘటనలో ఎన్‌ఆర్‌ఐ పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.

ఇక మిగిలిన నిందితుల్లో వెనిగళ్ల శ్రీకాంత్‌కు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లిన శ్రీకాంత్ ఈ కేసు బయటపడగానే హఠాత్తుగా మాయమయ్యాడు. విదేశాల్లోనే ఉన్నాడా... దేశంలోని మరో రాష్ట్రంలో తలదాచుకున్నాడా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో టీడీపీ నేతకు సన్నిహితుడైన పెండ్యాల శ్రీకాంత్ కూడా వేరే రాష్ట్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ తీసుకున్న తరువాతే వీరు రాష్ట్రానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నా.. వీరిని రప్పించేందుకు, ఆర్థిక మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Back to Top