ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

  • ఇంత నీచ ప్రభుత్వం దేశంలోనే లేదు
  • దేవుడి భూములనే దోచేయాలని చూశారు
  • పథకం ప్రకారం సత్రం భూములను కాజేయాలని చూశారు
  • నేటి వేలంపాట ధరతో ప్రభుత్వ అవినీతి బట్టబయలైంది
  • నైతిక బాధ్యత వహించి బాబు  రాజీనామా చేయాలి
  • భూ దోపిడీ కుట్రపై దర్యాప్తు జరిపించాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి డిమాండ్
విజయవాడః సదావర్తి సత్రం భూముల విషయంలో ప్రభుత్వ దోపిడీ గురించి  వైయస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోందని, ఇవాళ వేలంపాటతో అది రుజువైందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు.  ప్రభుత్వం ఓ పథకం ప్రకారం తన మనుషుల ద్వారా సత్రం భూములను  దోచేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. ఈరోజు జరిగిన వేలంపాటలో ఆ భూములకు సంబంధించిన ధరలను చూస్తే... ప్రభుత్వ అవినీతి బట్టబయలైందన్నారు.  ఈ విషయంలో వైయస్సార్సీపీ విజయం సాధించిందని, భగవంతుడికి న్యాయం జరిగిందని భావిస్తున్నామన్నారు.  విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. బాబు తన అనుయాయులకు కారుచౌకకు దేవుడు భూములను కట్టబెట్టడంతో ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాను సారం మళ్లీ వేలం నిర్వహించగా రూ.60.30కోట్లు ధర పలికింది. సిగ్గు, శరం ఉన్నముఖ్యమంత్రి అయితే నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. 

ఈ మూడేళ్లలో ప్రభుత్వం అవినీతిని కొంత పుంతలు తొక్కించిందని పార్థసారధి మండిపడ్డారు.  దేవుడి భూములను ఏవిధంగా దోచుకోవచ్చని పనిచేసిందే తప్ప ప్రజలకు ఏవిధంగా మేలు చేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని పార్థసారధి నిప్పులు చెరిగారు. సిగ్గు, లజ్జ లేకుండా దేవాదయ భూములకు సంబంధించిన రూల్స్ ను అతిక్రమించి మరీ ప్రభుత్వం భూముల కాజేసే కుట్ర చేసిందన్నారు. ప్రభుత్వ నింబధనల ప్రకారం ఏ భూమి అమ్మాలన్నా కేబినెట్  అప్రూవల్ ఉండాలన్నారు. అవేమీ లేకుండా  వాళ్లకు వాళ్లే నిర్ణయం తీసేసుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం  మద్రాసులో భాగంగా ఉన్న కొన్ని కోట్ల విలువ చూసే సత్రం భూములకి కేవలం 50 లక్షల ధర నిర్ణయించి భూములు వేలం వేశారని, ఆ వేలంలో కూడ నిబంధనలు పాటించలేదని పార్థసారధి అన్నారు. రెండు భాషా పత్రికల్లో ప్రకటన చేయాల్సిన ప్రభుత్వం గోప్యంగా తమకు అనుకూలమైన వారితో వేలం ముగించిందని అన్నారు.  చరిత్రలో ఏ ప్రభుత్వం కూడ ఇంత నీచంగా దేవాదయ భూములను దోచుకునేందుకు పథకం పన్నుతుందనుకోరని అన్నారు.

కొంత మంది పెద్దలు పేదలకు దానం చేసిన దేవాదయ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని కోర్టుకు వెళితే.... కొన్ని ప్రొసీజర్స్ తో అమ్మాలని నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. కానీ, ప్రభుత్వం అవేమీ పాటించకుండా భూముల దోపిడే లక్ష్యంగా కుట్ర చేసిందన్నారు. బాబు తన వారికి రూ. 22కోట్లకు ఇచ్చేసిన భూములు ఇవాళ రూ.60.30 కోట్లకు వేలం పాడారని అన్నారు. వైయస్సార్సీపీ కనుక ఆందోళన చేయకపోతే పాలకులు భూములను అతిచౌకగా దోచేసేవాళ్లని పార్థసారధి అన్నారు. ప్రజాధనం అన్యాక్రాంతం కాకుండా కాపాడ్సిన ప్రభుత్వమే  ఆఖరికి దేవుడు భూములు కూడ దోచేస్తుంటే  ప్రజలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సర్కార్ దేవాదయ భూములను దోచుకునేందుకు పన్నిన కుట్ర మీద వైయస్సార్సీపీ చేసిన పోరాట ఫలితంగా కోర్టు ప్రభుత్వ తీరును తప్పుబట్టిందని పార్థసారధి గుర్తు చేశారు. ఈవిషయంలో దేవాదయ శాఖ మంత్రిని కూడ పక్కనబెట్టి కుట్రపూరితంగా వ్యవహరించినందుకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు. 

బాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా  ప్రభుత్వ భూములను కారుచౌకగా తన వాళ్లకు  అంటగట్టేందుకు  వస్తారు తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదని ఈ ఉదంతం స్పష్టం చేస్తోందన్నారు. గతంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, కార్పొరేట్ ఫ్యాక్టరీస్ ను దేవేందర్ గౌడ్, నామా నాగారేశ్వరరావులకు కారుచౌకగా ఏవిధంగా కట్టబెట్టాడో ప్రజలు మర్చిపోలేదని పార్థసారధి అన్నారు. ఓ పక్క కూర్చునేందుకు కుర్చీలేదు, ఫ్యాన్ లేదు, 24 గంటలు కష్టపడుతున్నానంటూ దొంగ కన్నీరు పెడుతూ...మరోపక్క ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ బాబు తన వాళ్లకు ఏవిధంగా కట్టబెడుతున్నాడో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.  వేలంపాటలో పలికిన రూ. 60.30 కోట్లు కూడ బాబు తన మనుషులతోనే పాట పాటించారని సమాచారం వస్తోందని, త్వరలోనే అన్నీ బయటపడతాయని అన్నారు.  తక్కువ ధరకు భూములు కొట్టేయాలన్న ఇంత నీచ ప్రభుత్వం, నాయకుడు దేశంలో ఎవరూ ఉండరని అన్నారు.  నిబంధనలు అతిక్రమించి, తన వారికి కారుచౌకకు భూములు కట్టబెట్టిన దానిపై దర్యాప్తు జరిపించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. 

ఆత్మహత్యలు కాదు..కార్పొరేట్ హత్యలు
టీడీపీ సర్కార్ విద్యారంగాన్ని కార్పొరేట్ చేతిలో పెడుతోందని పార్థసారధి మండిపడ్డారు. నారాయణ విద్యా సంస్థలు తమ వ్యాపారం కోసం పిల్లల్ని మానసిక ఒత్తిడికి గురిచేయడం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం కళ్లఅప్పగించి చూస్తుంది తప్ప చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులవి ఆత్మహత్యలు కావని,  తమ వ్యాపార అభివృద్ధి కోసం విద్యార్థులను కొట్టడం మూలంగా కొన్ని సంస్థలు చేస్తున్న హత్యలని అన్నారు. పిల్లలను మానసిక ఒత్తిడినుంచి రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top