కక్ష సాధింపుకే బాబు ప్రాధాన్యం...ధర్మాన

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలో తమ ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలను స్థాపించకూడదని, స్థాపించినా అవి నడవకుండా చేయాలని టీడీపీ సర్కారు ఆలోచనగా ఉన్నట్లుందని.. సరస్వతి పవర్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్‌కు మైనింగ్ లీజు రద్దు వ్యవహారం దీనికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిశ్రమలు తమ రాష్ట్రంలోనే ఏర్పాటు కావాలని దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్న సమయంలో ఏపీ సర్కారు ఇటువంటి చర్యలకు పాల్పడటం రాష్ట్ర శ్రేయస్సుకు ఏ మాత్రం
ప్రయోజనం కలిగించేవిగా లేవని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్పుపట్టారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లీజు రద్దుకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవన్నారు.

ఆ సంస్థల లీజులను రద్దు చేయలేదేం?

‘ప్రభుత్వం చట్టాలు అమలు చేసే తీరు అందరి పట్లా ఒకేలా ఉండాలి. సరస్వతి పవర్ మైనింగ్ లీజు రద్దుకు చూపిన కారణాలు, అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన అన్ని సంస్థల లీజులను ప్రభుత్వం రద్దు చేసిందా..? అలా ఎందుకు చేయలేదు..?’’ అని ధర్మాన ప్రశ్నించారు. ‘‘సరస్వతి పవర్ మైనింగ్ లీజు రద్దు సందర్భంలో ప్రభుత్వ చర్యలు చూస్తే రాష్ట్రాభివృద్ధికి నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న మాటలు అన్నీ అసత్యం. రాష్ట్రాభివృద్ధికంటే తమ ప్రత్యర్థులపై కక్ష సాధించాలనే ఆసక్తే ఈ ప్రభుత్వానికి ఎక్కువగా ఉందని ఈ విషయంతో రూఢీ అయిపోయింది’’ అని ఎండగట్టారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకే పార్టీకి చెందినవి కొనసాగవు. ఇలాంటి చెడు సంప్రదాయాలను భవిష్యత్‌ లో అధికారంలోకి వచ్చే ఇతర పార్టీలు ఒకవేళ కొనసాగిస్తే రాష్ట్ర ప్రజల గతి ఏమవుతుంది?’’ అని బాబు తీరును దుయ్యబట్టారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలను విడనాడాలని, ఇలాంటి ధోరణులు మానుకోవాలని హితవుపలికారు.

99 శాతం పరిశ్రమలు సకాలంలోపూర్తవుతున్నాయా?

రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ మొదలుపెట్టిన వాటిలో 99 శాతం పరిశ్రమలు సకాలంలో పూర్తి అవడం లేదని ధర్మాన గుర్తుచేశారు. పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, భూసేకరణ వంటి ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకునే చర్యలు పరిశ్రమలకు సకాలంలో అనుమతులు రాని పరిస్థితికి కారణమవుతున్నాయన్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వమే మొదలు పెట్టిన వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టులు సైతం ఇలాంటి అనుమతుల కారణంగా సకాలంలో పూర్తికాని పరిస్థితి ఉందన్నారు. కొన్ని అనుమతులకు పదేళ్లకు పైగా సమయం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న కారణాలు చూపి సరస్వతికి మైనింగ్ లీజు రద్దు చేయడం కక్షసాధింపు చర్యగా అందరికీ అర్థమవుతోందని చెప్పారు.

పరిశ్రమ ఏర్పాటుకోసం అనుమతులకు ప్రయత్నాలు చేస్తున్న సంస్థను లీజు పొడిగింపు కోసం ధరఖాస్తు చేసుకోలేదనో, కేవలం రూ. 23వేల అద్దె బకాయిలున్నారని కారణాలు చూపో లీజు రద్దు చేయడం సరైన చర్య కాదన్నారు. ఇది పూర్తిగా పక్షపాత చర్య అన్నారు. మైనింగ్‌కు సంబంధించిన భూములు ప్రభుత్వ భూములు కావని ధర్మాన చెప్పారు. ‘‘అవి పూర్తిగా ప్రైవేట్ భూములు. పూర్తిగా డబ్బు చెల్లించి, విక్రేతల అంగీకారంతో కొన్న భూమలు. భూమిలో ఉండే ఖనిజాలు ప్రభుత్వానికి చెందినవి కనుక, ప్రభుత్వం ఆ మేరకు లీజు ఇస్తాయి. అమ్మిన భూములు మళ్లీ అక్రమించండని ప్రభుత్వమే ప్రోత్సహించడం తగునా? ఒక పార్టీ లేదంటే ఒక ప్రభుత్వం ప్రజలకు చెప్పే ఆదర్శం ఇదేనా?’’ అని ఆయన ప్రశ్ని౦చారు. ఈ ప్రభుత్వం చేసినట్టే తర్వాత అధికారంలోకి వచ్చేవారు ఇదే సంప్రదాయం కొనసాగిస్తే రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు ఎవరు ముందుకొస్తారన్నారు. ఇలాంటి సంప్రదాయాలు  రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకరం కాదన్నారు.

Back to Top