అన్నదాత జీవితాలతో చెలగాటమా?

రుణమాఫీపై అడ్డగోలు నిబంధనలు
15తో ముగుస్తున్న దరఖాస్తుల గడువు
జిల్లా గ్రీవెన్స్ సెల్స్‌లో రైతుల తిప్పలు
ఏడాది గడుస్తున్నా అతీగతి లేని తొలిసంతకం
 
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసి కొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానున్నది. కానీ ఇప్పటికీ అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించనేలేదు. రుణమాఫీ కోసం అన్నదాతలు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అడ్డగోలు నిబంధనలతో తొలి విడతలోనే ప్రభుత్వం సగం మందిని ఏరేసింది. మిగిలిన వారిలో చాల మందికి ఆధార్  నెంబర్ సరిపోలడం లేదని, భూమి సర్వే నెంబరు తప్పుగా ఉందని ఎగ్గొట్టింది. దీనికి బ్యాంకు అధికారుల తప్పిదాలు కూడా తోడయ్యాయి. వీటన్నింటి పుణ్యమా అని అర్హులైన రైతులు రుణమాఫీకి దూరమవుతున్నారు. రుణమాఫీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అన్ని అర్హతలూ ఉండి రుణమాఫీ పొందనివారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ ఆయా డివిజన్ కేంద్రాలలో రైతు రుణమాఫీ సలహా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రుణమాఫీ కావాలనుకున్న రైతులు తమ దరఖాస్తులను ఈ కేంద్రాలలో అందిస్తే వాటిని అక్కడి సిబ్బంది పరిశీలిస్తారు. అంతా బాగా ఉంటే ఆ రైతులు తమ దరఖాస్తులను తిరిగి జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్స్‌కు తీసుకువెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వారం రోజులుగా రైతులు పోటెత్తుతున్నారు.
 
కనీస సదుపాయాలు లేని గ్రీవెన్స్ సెల్స్
జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏమీ లేవు. ఎండన పడి వస్తున్న రైతులు సేద దీరేందుకు ఎలాంటి అవకాశాలూ లేవు. సమ్మెతో ఆర్టీసీ బస్సులు లేక, ఉన్న బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తీరా ఎలాగో తంటాలు పడి ఆ కేంద్రాలకు చేరుకున్నా అక్కడ దరఖాస్తులు ఇచ్చేందుకు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. దరఖాస్తు ఎలా నింపాలో తెలియక, అందుబాటులో తగినంత మంది సిబ్బంది లేక రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. రైతులలో వృద్ధులతో పాటు మహిళా రైతులూ అనేక మంది ఈ కేంద్రాల వద్ద అష్టకష్టాలు పడుతున్నారు. సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు.
 
ఎందుకిలా కాల్చుకుతింటున్నారు...?
‘‘రైతులను నాలుగైదు సార్లు తిప్పితే నీరసం వచ్చి పోతారు... రుణమాఫీ చేయనక్కరలేదని అధికారులు, రాష్ర్ట ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఉంది. మీకు మాఫీ చేయలేం అని చెబితే మా దారిన మేం పోతాం కదా..? మమ్మల్ని ఎందుకిలా కాల్చుకు తింటున్నారు..?’’ అని వాపోతున్నారు.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన రైతు గొసుల లచ్చయ్య. ఈయనకు 3.32 ఎకరాల భూమి ఉంది. దానిపై రు. 85 వేల రుణం తీసుకున్నారు. అయితే 2.40 ఎకరాలు మాత్రమే ఉందని, ఇందుకు రు. 57,600 మాత్రమే మాఫీ వస్తుందని ఆన్‌లైన్‌లో వచ్చింది. అదేమంటే పై నుంచి అలా వస్తే మమ్మల్నేం చేయమంటారు.? అని బ్యాంకోళ్లు అంటున్నారని లచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మళ్లీ అన్ని పత్రాలు ఇవ్వాలా..?
రుణమాఫీలో తలెత్తిన సమస్యలను తెలుపుకునేందుకు వచ్చే రైతులు మరోమారు అన్ని పత్రాలను ఇస్తేనే అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రుణమాఫీలో ఏ చిన్న సమస్య ఉన్నా రైతులు తమ ఫిర్యాదుతో పాటు ఏయే బ్యాంకులో ఎంత భూమికి ఎంత రుణాన్ని పొందారనే విషయాలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల నకలు, రేషను కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌బుక్, కుటుంబంలోని అందరి ఆధార్ కార్డుల నకళ్లు జత చేయాలి. అధికారులు వాటిని పరిశీలిస్తూ ఏ ఒక్క పత్రంలో ఏ చిన్న అక్షరం తప్పు ఉన్నా దరఖాస్తులను స్వీకరించకుండా తిప్పి పంపేస్తున్నారు.
 
హైటెక్ పాలనలో రిజిస్టర్డ్ పోస్టా..?
కంప్యూటర్, సెల్‌ఫోన్‌తో సహా టెక్నాలజీ అంతా తానే కనిపెట్టానని చెప్పుకుంటూ తిరిగే ముఖ్యమంత్రి... మన చంద్రబాబు నాయుడుగారు. రాష్ర్టంలో పరిపాలన అంతా ఆన్‌లైన్ పద్దతిలోనే అని ఆయన డంబాలు పలుకుతుంటారు. అయితే జిల్లాల్లో అధికారులు రైతు రుణమాఫీ సమస్యలపై వచ్చే దరఖాస్తులను మాత్రం రిజిస్టర్డ్ పోస్టు ద్వారా హైదరాబాద్‌లోని రుణమాఫీ కమిటీ ప్రతినిధి కుటుంబరావుకు పంపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జిల్లాల్లోని వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. ఆ కుటుంబరావుకు ఈ దరఖాస్తులు ఎప్పుడు చేరాలి..? ఆయన ఇవన్నీ ఎప్పుడు చూడాలి...? అసలు రుణమాఫీ సమస్యలపై వచ్చే దరఖాస్తులు  గోప్యంగా ఉంచడమెందుకు? స్వీకరించే దరఖాస్తులను ఏంచేస్తున్నారో.. ఏమేం చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చెప్పడం లేదు..?

తాజా ఫోటోలు

Back to Top